Daggubati Purandeswari: సాయంత్రానికల్లా మద్యం కంపెనీల యజమానుల పేర్లను బయట పెట్టగలరా: పురందేశ్వరి సవాల్
- రాష్ట్రంలో మద్యం కంపెనీల యజమానులంతా వైసీపీ వాళ్లేనన్న పురందేశ్వరి
- దమ్ము, ధైర్యం ఉంటే వాళ్ల పేర్లను బయట పెట్టాలని డిమాండ్
- చంద్రబాబు కేసుల గురించి అమిత్ షా అడిగారని వెల్లడి
ఏపీలో మద్యం కంపెనీల యజమానులంతా వైసీపీ వాళ్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న కంపెనీల యజమానుల పేర్లను ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని సవాల్ విసిరారు. ఈ సాయంత్రానికల్లా పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే పేర్లన్నీ బయటపెట్టాలని అన్నారు. ఎవరైనా మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని గతంలో సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు. మాట మార్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మద్యం డబ్బులను తాడేపల్లికి తరలించేందుకే డిజిటల్ పేమెంట్లను స్వీకరించడం లేదని దుయ్యబట్టారు. నాసిరకం మద్యం కారణంగా చనిపోయినవారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా, నారా లోకేశ్ ల భేటీపై ఆమె స్పందిస్తూ... లోకేశ్ ను అమిత్ షా పిలిచారా? లేదా లోకేశ్ అడిగారా? అనేది అప్రస్తుతమని చెప్పారు. ఇద్దరి భేటీ జరిగిందని.. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు? ఏయే బెంచ్ ల మీదకు కేసులు వెళ్లాయి? అనే విషయాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. సమావేశానికి రావాలని కిషన్ రెడ్డి తనను పిలిచారని, దాని గురించి ఆయనను అడగండని అన్నారు.