Nadendla Manohar: టోఫెల్ పరీక్ష ఎవరికి అవసరమో బొత్సకు తెలుసా?: నాదెండ్ల మనోహర్
- మూడో తరగతి విద్యార్థులకు టోఫెల్ ఎందుకు? అని ప్రశ్న
- ఈటీసీ సంస్థతో ఒప్పందానికి ముందు మంత్రి దానిని చదివారా? అని నిలదీత
- సీఎంవో చెప్పినట్లు నడుచుకున్నారా? అని విమర్శ
టోఫెల్ వ్యవహారంపై మంత్రి బొత్స నారాయణతో తాను చర్చకు సిద్ధమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జగనన్న విదేశీ విద్య అంశంపై వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా నాదెండ్ల మాట్లాడుతూ... అసలు టోఫెల్ పరీక్ష ఎవరికి అవసరమో బొత్సకు తెలుసా? అని ప్రశ్నించారు. డిగ్రీ థర్డ్ ఇయర్ విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు టోఫెల్ పరీక్షకు సిద్ధమవుతారని, కానీ మూడో తరగతి విద్యార్థులకు ఎందుకో చెప్పాలన్నారు.
ఈటీసీ సంస్థతో ఒప్పందానికి ముందు సంబంధిత మంత్రి దానిని చదివారా? అని నిలదీశారు. ప్రశ్నాపత్రం ప్రత్యేక కాగితాన్ని ఉపయోగించాలని, ఫలానా ప్రింటర్‌పై ముద్రించాలనే షరతులు ఏమిటి? అన్నారు. ఈ ఒప్పందాలను చూస్తుంటే ఏదో రహస్య అజెండా కనిపిస్తోందన్నారు. సీఎంవో చెప్పినట్లు ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.