Chandrababu: జైళ్లలో ఏసీలు ఏర్పాటు చేయరు... చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందన

Jail dept DIG Ravi Kiran talks about Chandrababu healh

  • స్కిల్ కేసులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • రాజమండ్రి జైలులో డీహైడ్రేషన్, అలర్జీకి గురైన టీడీపీ అధినేత
  • నిన్న జైలులోకి వెళ్లి చంద్రబాబును పరిశీలించిన వైద్యులు
  • జైలులో ఏసీల ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించవన్న డీఐజీ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు గత నెలరోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే, కొన్నిరోజులుగా ఆయన డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతుండడంతో, నిన్న ప్రభుత్వ వైద్యులు వెళ్లి ఆయనను పరిశీలించి తగిన ఔషధాలు సూచించారు. కానీ, చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అన్నీ నియంత్రణలోనే ఉన్నాయని తెలిపారు. బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధం అని చెప్పారు. చంద్రబాబును ఆసుపత్రికి తరలిస్తున్నట్టు, ఆసుపత్రి బెడ్ పై చంద్రబాబు ఉన్నట్టు కొన్ని పాత ఫొటోలు దర్శనమిస్తున్నాయని, అదంతా అవాస్తవం అని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. 

రాజమండ్రి జైలులో ఉన్న వైద్యాధికారుల్లో ఒకరు చర్మవ్యాధుల నిపుణులని ఆయన వెల్లడించారు. ఆ వైద్యురాలు చంద్రబాబును పరిశీలించి కొన్ని మందులు సూచించారని, అయితే, సీనియర్ వైద్యుల అభిప్రాయం కూడా తీసుకోవాలని భావించామని తెలిపారు. 

దాంతో, చర్మవ్యాధులకు సంబంధించి ఎవరైనా సీనియర్ డాక్టర్ ను పంపాలని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటిండెంట్ ను కోరామని, వారు డెర్మటాలజీ విభాగం అధిపతిని, సంబంధిత శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను పంపించారని డీఐజీ రవికిరణ్ వివరించారు. వారు చంద్రబాబును పరీక్షించి, రాజమండ్రి జైలు చర్మవ్యాధుల డాక్టర్ ఇచ్చిన మందులను కొనసాగించాలని తెలిపారని వెల్లడించారు. 

ఇక, చంద్రబాబుకు ఏసీ ఉంటే సరిపోతుందన్న అభిప్రాయాలను మీడియా ప్రతినిధి డీఐజీ రవికిరణ్ తో ప్రస్తావించారు. అందుకాయన స్పందిస్తూ, జైళ్లలో ఏసీలు ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు. తనకు తెలిసి దేశంలోని ఏ జైలులోనూ ఏసీలు ఉండవని అన్నారు. 

రాజమండ్రి జైలులో సుమారు 2 వేల మంది ఖైదీలు ఉన్నారని, వాళ్లలో కూడా చాలామంది రకరకాల వ్యాధులతో బాధపడుతుంటారని, ప్రతి ఖైదీ ఆరోగ్యంపైనా తాము వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తామని పేర్కొన్నారు.

More Telugu News