Botsa Satyanarayana: అమిత్ షాను లోకేశ్ కలవడంపై మంత్రి బొత్స స్పందన
- ఢిల్లీలో అమిత్ షాను కలిసిన లోకేశ్
- తమ బాధలు చెప్పుకునేందుకు కలిసి ఉంటాడన్న బొత్స
- సీఎం జగన్ పై చాడీలు కూడా చెప్పి ఉంటాడని వ్యాఖ్యలు
- ప్రతి అంశం బీజేపీకి చెప్పి చేయాల్సిన అవసరం తమకు లేదన్న బొత్స
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలవడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎవరైనా కలవొచ్చని బొత్స అన్నారు. తమ బాధలను అమిత్ షాకు చెప్పుకునేందుకు లోకేశ్ కలిసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పై చాడీలు కూడా చెప్పి ఉంటాడని అన్నారు.
అమిత్ షా వద్దకు పురందేశ్వరి, లోకేశ్ కలిసి వెళ్లారో, విడివిడిగా వెళ్లారో తమకు అవసరం లేదని అన్నారు. టీడీపీకి రాష్ట్రంలో ఏపీ బీజేపీ బీ టీమ్ అని బొత్స అభివర్ణించారు. బీజేపీకి ప్రతి అంశం చెప్పి చేయాల్సిన అవసరం తమకు లేదని బొత్స స్పష్టం చేశారు.
విశాఖకు వెళ్లే అంశంపై తాము జీవో కూడా ఇస్తే, దొడ్డిదారి ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. విశాఖతో పాటు కడపలోనూ సీఎంకు క్యాంపు కార్యాలయం ఉందని వివరించారు.
కొన్ని రాజకీయ పక్షాలకు నోటికొచ్చినట్టు మాట్లాడడం అలవాటుగా మారిందని బొత్స విమర్శించారు. ఓ సెలబ్రిటీ పార్టీ నాయకుడు బైజూస్ అంశం మీద మాట్లాడాడని, బైజూస్ ఒప్పందంపై అధ్యయనం చేసి మాట్లాడాలని ఆయనకు సలహా ఇచ్చానని తెలిపారు. ఇప్పుడు టోఫెల్ గురించి కూడా అదే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.