Nara Lokesh: ఇవాళ లంచ్ ముందు బాహుబలి సినిమా చూపించారు: నారా లోకేశ్

Lokesh funny comments on CID questioning

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ
  • నేడు రెండో రోజు సిట్ కార్యాలయానికి వచ్చిన లోకేశ్
  • గూగుల్ ఎర్త్ లో హెరిటేజ్ భూములు చూపించారని వెల్లడి
  • రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల గుండా వెళుతోందని చెప్పారని వివరణ

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండో రోజు సీఐడీ విచారణ ముగిసిన అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. లంచ్ కు ముందు ఇవాళ తనకు బాహుబలి సినిమా చూపించారని అన్నారు. 

"నా ముందు గూగుల్ ఎర్త్ తెరిచారు. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై ఎలా ఉంటుందో చూపించారు. ఆ విధంగా చూడడం నాకు మొదటిసారి. హెరిటేజ్ నాడు ఎన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసిందీ, ఏ సర్వే నెంబరు అనేది నాకు తెలుసు. కానీ ఇవాళ బాహుబలి సినిమా చూపించినట్టు పెద్ద స్క్రీన్ పై నీట్ గా చూపించారు. 

దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే... ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల లోపల నుంచి వెళుతుందట. దానర్థం, ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల హెరిటేజ్ భూమిని కోల్పోయింది... ఇదీ ఇవాళ నేను తెలుసుకున్నది. మొత్తమ్మీద బాహుబలి సినిమా చూపించారు... దాని తర్వాత బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఏవేవో ప్రశ్నలు అడిగారు. 

ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంతో నాకెలాంటి సంబంధం లేదు. అలైన్ మెంట్ లో నా పాత్ర లేదు. మా కుటుంబంలో ఎవరూ కూడా కోర్ క్యాపిటల్ రీజియన్ లో కనీసం ఒక గజం స్థలం కూడా కొనలేదు. గత పదేళ్లుగా మా కుటుంబ సభ్యుల ఆస్తులు అవసరం లేకపోయినా ప్రకటిస్తున్నాం. పేర్కొన్న దానికంటే ఒక్క గజం స్థలం ఎక్కువుందని నిరూపిస్తే, వాళ్లకు మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తామని ఆనాడే చెప్పాను. ఇప్పటికీ నిరూపించలేదు. 

నన్ను రెండ్రోజుల నుంచి సీఐడీ వాళ్లు విచారిస్తున్నారు. నాకు సంబంధించిన ఆధారాలేవీ చూపించలేకపోయారు. నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని. నాకు చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ మానుకుని వచ్చాను. వీళ్లు విచారణకు పిలిచి రెండ్రోజుల పాటు నా సమయాన్ని వృథా చేశారు. ఇది కక్ష సాధింపు కాకపోతే ఇంకేటి?

మళ్లీ చెబుతున్నాను... వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారు. కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. జీవోలతో సీఎంకు సంబంధం ఏముంటుంది? నాటి అధికారులు ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లంపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? సంతకాలు చేసిన అధికారులను విచారణకు పిలవకుండా, పాలసీ ఫ్రేమ్ చేసిన చంద్రబాబును 32 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచడం బాధాకరం. 

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు కార్యదర్శిగా వ్యవహరించింది ప్రేమచంద్రారెడ్డే. ఆయన గుజరాత్ వెళ్లి పరిశీలించి స్కిల్ ప్రాజెక్టు అద్భుతం అని చెప్పారు. దీన్ని వెంటనే అమలు చేయాలి, రూ.285 కోట్లను వెంటనే విడుదల చేయండి అని ప్రేమచంద్రారెడ్డి నివేదిక ఇచ్చారు. కానీ ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో లేదు. 

ఇక, లింగమనేని రమేశ్ గారికి 2019లో రెంటల్ అడ్వాన్స్ కింద రూ.27 లక్షలు ఇచ్చిన విషయం మా అమ్మగారి ఐటీ రిటర్న్స్ లో ఎందుకు లేదని అడిగారు. ఆ సంగతి ఆడిటర్ ను అడగాలని చెప్పాను. మా తల్లి ఖాతా నుంచి రూ.27 లక్షలు అద్దె కోసం చెల్లించినట్టు బ్యాంకు స్టేట్ మెంట్ ను సీఐడీ వాళ్లే చూపిస్తున్నారు. అన్ని ఆధారాలు వాళ్ల దగ్గరే ఉంచుకుని కూడా ఏదో జరిగిందని ప్రశ్నిస్తున్నారు" అని నారా లోకేశ్ వివరించారు.

  • Loading...

More Telugu News