Revanth Reddy: కొడుకును మిస్సవుతున్నానంటూ కేటీఆర్ ట్వీట్... ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
- కుమారుడి పట్ల బెంగను ప్రదర్శించిన కేటీఆర్
- గుండె బరువెక్కుతోందా కేటీఆర్ అంటూ రేవంత్ వ్యంగ్యం
- నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రుల శాపం ప్రభుత్వానికి తగిలి తీరుతుందని వ్యాఖ్య
అమెరికాలో ఉన్న కొడుకును మిస్సవుతున్నానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దూరంగా ఉన్న బిడ్డ గుర్తొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్... కొడుకుతో కొన్నిరోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా... అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
"ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఏళ్ల తరబడి ఇంటి ముఖం చూడని లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా? ప్రభుత్వ వసతి గృహాల్లో మీరు పెట్టే తిండి తినలేక బిడ్డలు ఏడుస్తున్నారని తెలిసి అమ్మానాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా? కొడుకు తిరిగిరాక... పదేళ్లుగా ఈ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన నీలా కాదనుకున్నావా?" అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు.
తిండిపెట్టక చిన్నారులను ఏడిపించి, ఫీజు బకాయిలు చెల్లించకుండా యువతను గోస పెట్టి, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను వంచించిన మీ ప్రభుత్వానికి తల్లిదండ్రుల శాపం తగిలితీరుతుందని రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.