Hamas: ఇజ్రాయెల్ జరిపే ఒక్కొక్క దాడికి ప్రతిగా ఒక్కొక్క బందీని చంపేస్తాం: హమాస్ హెచ్చరిక
- ఇజ్రాయెల్ పై అనూహ్యరీతిలో విరుచుకుపడిన హమాస్ గ్రూపు
- 130 మందిని బందీలుగా పట్టుకున్న మిలిటెంట్లు
- బందీల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఖతార్
- ఖతార్ సూచనను ఏమాత్రం లక్ష్యపెట్టని ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపు
- ఇజ్రాయెల్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటున్న హమాస్
ఇజ్రాయెల్ పై ఎవరూ ఊహించని రీతిలో భయానక దాడులకు పాల్పడిన హమాస్ మిలిటెంట్ గ్రూపు వందల మందిని పొట్టనబెట్టుకోవడమే కాకుండా 130 మందిని బందీలుగా పట్టుకుంది.
అయితే, బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. చర్చల ద్వారా బందీల అంశాన్ని పరిష్కరించుకోవాలని ఖతార్ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇప్పటికే ఇజ్రాయెల్ వద్ద పాలస్తీనియన్లు పెద్ద ఎత్తున బందీలుగా ఉండగా, హమాస్ బందీలుగా పట్టుకున్నవారితో వారిని మార్పిడి చేసుకోవాలని ఖతార్ సూచించింది.
హమాస్ ఈ సూచనలను పెడచెవిన పెట్టింది. బందీల విడుదలకు ఇజ్రాయెల్ తో చర్చల ప్రసక్తే లేదని తెగెసి చెప్పింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపే ఒక్కొక్క దాడికి ప్రతిగా బందీలుగా ఉన్న వారిలో ఒక్కొక్కరిని చంపేస్తామని హమాస్ హెచ్చరించింది. ఈ మేరకు హమాస్ కు చెందిన అల్ ఖస్సామ్ బ్రిగేడ్ అధికార ప్రతినిధి అబు ఒబైదా ఓ ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న బందీల్లో కొందరిని హతమార్చామని అబు ఒబైదా వెల్లడించారు. ఇజ్రాయెల్ పై అక్టోబరు 7న జరిపిన దాడుల కోసం ఏళ్ల తరబడి ప్రణాళికలు రూపొందించి, సన్నాహాలు జరిపామని ఒబైదా వివరించారు.