Chandrababu: చంద్రబాబు బయటికి వచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదంటూ టీడీపీ శ్రేణుల దీక్షలు

TDP protests continues in AP

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • గత నాలుగు వారాలుగా రాజమండ్రి జైలులో రిమాండ్
  • చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు కూడా టీడీపీ దీక్షలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు ఇవాళ కూడా కొనసాగాయి. చంద్రబాబు బయటికి వచ్చేంత వరకు పోరాటం ఆపబోమంటూ సంకల్పం వహించిన టీడీపీ శ్రేణులు... ‘బాబుతో నేను’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కదంతొక్కాయి. 

మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్, సాధికార సమితి ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా జైలు నుండి బయటకు రావాలని కోరుకున్నారు. 

విశాఖలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు మధ్యలో అడ్డుకునేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చంద్రబాబు అభిమాన సంఘం నేత తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. 

ఉరవకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ఉరితాళ్లతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండారపు శ్రీధర్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కె.ఈ.శ్యామ్ ఆధ్వర్యంలో తెలుగు యువత నాయకులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నాలుగు స్తంభాల మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. 

కృష్ణా జిల్లా కంకిపాడులో తెలుగు యువత ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి బడేటి చంటి ఏలూరు చేపల తూము సెంటర్లో 26వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద జైలు సెట్టింగ్ వేసి చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. 

శింగనమల నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో నార్పల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 25వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నల్లగుడ్డలు కట్టుకొని మోకాళ్లపై  నిలబడి కుండలతో 'సైకో పోవాలి సైకిల్ రావాలి' అని నిరసన వ్యక్తం వ్యక్తం చేశారు. 

ఆదోని నియోజకవర్గలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో 26వ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వలసపాకల సెంటర్ లో మహిళలతో రిలే నిరాహర దీక్ష నిర్వహించారు. బాబుకు తోడుగా మేము సైతం అంటూ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 

గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి హిమని సర్కిల్ వరకు టీడీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‍కుమార్, నజీర్ అహ్మద్, మన్నవ మోహనకృష్ణ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. 

పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని వినూత్నంగా భజన చేసి నిరసన తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇంఛార్జ్ సత్యానందరావు ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. సత్యం కోసం పోరాడిన గాంధీజీ స్ఫూర్తితో టోపీలను ధరించి జగన్ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.

  • Loading...

More Telugu News