Bihar: ఆడ, మగ విద్యార్థులు కలసి కూర్చోవద్దు.. హుకుం జారీ చేసిన బీహార్ కాలేజీ

Bihar college bars girls and boys from sitting together
  • బీహార్ లోని సివాన్ జిల్లాలో మైనారిటీ కళాశాలలో ఆదేశాలు
  • ఉల్లంఘిస్తే కళాశాల నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిక
  • దీన్ని వ్యతిరేకిస్తున్న మహిళా హక్కుల సంఘాలు
బీహార్ లోని సివాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజ్ (మైనారిటీ) జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చోవద్దని, స్నేహపూరితంగా మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే బహిష్కరిస్తామని హెచ్చరించింది. బీహార్ లో ఈ తరహా ఆదేశాల జారీ ఇదే మొదటిది. దీంతో మహిళా కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాలేజీ గవర్నింగ్ బాడీ సెక్రటరీ, ప్రిన్సిపల్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

‘‘మహిళ, పురుష విద్యార్థులు కలసి పక్కపక్కన కూర్చున్నా, లేక సన్నిహితంగా మాట్లాడుకుంటున్నా కళాశాల విద్యార్థుల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తాం’’ అని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. నిజానికి ఇది బాలుర కళాశాల కాగా, ఇటీవలి సంవత్సరాల్లో మహిళా విద్యార్థులను కూడా చేర్చుకుంటున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ తేవడం కోసం, క్రమం తప్పకుండా క్లాసులకు హాజరయ్యేలా చూడడమే ఈ ఆదేశాలు తీసుకురావడం వెనుక ఉద్దేశ్యమని కళాశాల వివరణ ఇచ్చింది. క్రమశిక్షణ కోసమేనంటూ, సమాజంలో అన్యాయానికి చోటు లేదని పేర్కొంది. 

ఇటీవలే కళాశాలలో ఇద్దరు మహిళా విద్యార్థినులు ఒకే బోయ్ ఫ్రెండ్ కోసం గొడవ పడగా, అది పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటివి అరికట్టే ఉద్దేశ్యంతోనే తాజా ఆదేశాలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మహిళా హక్కుల కార్యకర్తలు మాత్రం ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నారు. వయోజనులకు ఏది సరైనదో తెలుసుకునే స్వయంప్రతిపత్తి ఉండాలంటూ వాదిస్తున్నారు. ఇలాంటి ఆదేశాలు వారి స్వేచ్ఛను హరిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Bihar
college
bars
prohibited
girls and boys
sitting together

More Telugu News