Prigozhin: గ్రనేడ్ పేలడం వల్లే ప్రిగోజిన్ విమానం కూలిందా? పుతిన్ ఏమన్నారంటే..!

Hand Grenade Fragments Found In Wagner Chief Prigozhins Body Says Putin

  • రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ చీఫ్ మృతిపై పుతిన్ అనుమానాలు
  • ప్రిగోజిన్ సహా ఇతరుల శరీరాల్లో గ్రనేడ్ అవశేషాలు గుర్తించినట్లు వెల్లడి
  • ఆ విమానంపై బయటి నుంచి దాడి జరగలేదని స్పష్టం చేసిన రష్యా అధ్యక్షుడు

రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ కు చీఫ్ గా వ్యవహరించిన ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా స్పందించారు. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, విమానంపై బయటి నుంచి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రిగోజిన్ తో పాటు ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి శరీరాల్లో గ్రనేడ్ అవశేషాలను గుర్తించినట్లు పుతిన్ చెప్పారు. దీంతో వారు ప్రయాణిస్తున్న విమానంలో గ్రనేడ్ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించిన ప్రిగోజిన్.. ఆ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వంతో పుతిన్ తో రాజీ కుదుర్చుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు నెలలకు గత ఆగస్టులో వాగ్నర్ గ్రూప్ ముఖ్యులతో కలిసి ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్ సహా విమానంలో ఉన్న వారంతా చనిపోయారు. ఇది ప్రమాదం కాదని, పుతిన్ సైన్యమే విమానాన్ని కూల్చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఆరోపణలపై పుతిన్ ఎన్నడూ స్పందించలేదు.. అయితే, తాజాగా ప్రిగోజిన్ మరణంపై తన వార్షిక సమావేశంలో మాట్లాడారు. ప్రిగోజిన్ తన జీవితంలో ఎన్నో తీవ్రమైన తప్పులు చేశాడు కానీ సరైన ఫలితాలను రాబట్టాడని మెచ్చుకున్నారు. అయితే, విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్న అధికారులపై పుతిన్ విమర్శలు గుప్పించారు. ప్రిగోజిన్ సహా ఇతరుల శరీరాలకు ఆల్కహాల్, డ్రగ్ టెస్టులు జరపకపోవడాన్ని పుతిన్ తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News