Maharashtra: రూ.100 లంచం తీసుకున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
- 2007లో రూ.100 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రభుత్వ వైద్యుడు
- ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా తేలుస్తూ 2012లో స్పెషల్ కోర్టు తీర్పు
- కింది కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- రూ.100 లంచం చాలా చిన్న విషయమంటూ నిందితుడికి విముక్తి కల్పించిన హైకోర్టు
వంద రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఓ ప్రభుత్వ వైద్యుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మహారాష్ట్రలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. పూణెలోని పౌడ్ గ్రామీణ ఆసుపత్రిలో అనిల్ షిండే అనే వైద్యుడు ఉన్నారు. 2007లో స్థానికంగా ఉండే ఓ వ్యక్తిపై దాడి జరిగింది. అతడికి గాయాలయ్యాయి. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని అతడు షిండేను ఆశ్రయించాడు. ఈ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అతడిని రూ.100 డిమాండ్ చేసిన అనిల్ షిండే డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు.
ఈ కేసులో స్పెషల్ కోర్టు షిండేను నిర్దోషిగా ప్రకటిస్తూ 2012లో తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, స్పెషల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2007లో రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని తీర్పు వెలువరించింది.