Talasani: చంద్రబాబుకు మద్దతుగా తలసాని వ్యాఖ్యలు.. ఏం సందేశమిస్తున్నారంటూ వైసీపీ కౌంటర్!
- మంత్రి హోదాలో ఉంటూ గజదొంగ చంద్రబాబు అరెస్ట్‌ను సమర్థిస్తారా? అంటూ వైసీపీ ప్రశ్న
- నైపుణ్య శిక్షణ ఇచ్చే పేరుతో రూ.371 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణ
- యువత భవిష్యత్తును అంధకారం చేసిన వ్యక్తిని సమర్థించి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీత
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 'తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ఒక మంత్రి హోదాలో ఉంటూ రూ.6 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న గజదొంగ చంద్రబాబు అరెస్టును సమర్థించడం ఏమిటి? నైపుణ్య శిక్షణ ఇచ్చే పేరుతో రూ.371 కోట్ల కుంభకోణానికి పాల్పడి, యువత భవిష్యత్తును అంధకారం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తిని సమర్థించడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు?' అంటూ ట్వీట్ చేసింది.
అంతేకాదు, తలసాని ద్వంద్వ వైఖరి అంటూ గతంలో చంద్రబాబును విమర్శించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. హైదరాబాద్‌ను నేను నిర్మించానని చెప్పే చంద్రబాబు నాలుగున్నరేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేదు? జపాన్, సింగపూర్ అంటూ చంద్రబాబు రాజధాని కోసం 33వేల ఎకరాలు సమీకరించి కూడా నిర్మించలేదని మండిపడిన వీడియోను పోస్ట్ చేసింది. తలసాని నిన్న మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని, తాను ఖండిస్తున్నానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.