- 14 ఏళ్లపాటు తగ్గిపోతున్న ఆయుర్దాయం
- 40 ఏళ్లకు వెలుగు చూస్తే 10 ఏళ్లు తక్కువ జీవిత కాలం
- పురుషులతో పోలిస్తే మహిళల్లో మరింత తక్కువ
- తాజా అధ్యయనంలో వెలుగు చూసిన ఫలితాలు
మధుమేహం.. నియంత్రణలో పెట్టుకోకపోతే ఎంతో నష్టం చేస్తుంది. నియంత్రణలో లేకపోతే దీర్ఘకాలంలో ముఖ్యమైన అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఇదే విషయాన్ని తాజా అధ్యయనం తన ఫలితాల రూపంలో తెలియజేసింది. 30 ఏళ్లలోపు టైప్-2 మధుమేహం బారిన పడితే జీవించే కాలం తగ్గిపోతున్నట్టు చెబుతోంది. 30 ఏళ్లలోపు ఈ వ్యాధి బారిన పడిన వారి జీవించే కాలం సగటున 14 ఏళ్లు తగ్గుతోందట.
చిన్న వయసులో దీని బారిన పడితేనే ఆయుష్షు క్షీణిస్తుందని అనుకోవద్దు. పెద్ద వయసులోని వారికి కూడా ఇది తప్పదు. 50 ఏళ్ల వయసులో ఇది నిర్ధారణ అయితే వారికి సైతం జీవించే కాలం సగటున ఆరేళ్లు తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. 40 ఏళ్ల వయసులో బయటపడితే 10 ఏళ్లు జీవితం కాలం తగ్గుతోంది. మహిళల్లో అయితే 30 ఏళ్లలోపు బయటపడితే 16 ఏళ్లు, 40 ఏళ్లకు బయటపడితే 11 ఏళ్లు, 50 ఏళ్లకు నిర్ధారణ అయితే 7 ఏళ్ల చొప్పున జీవితం కాలం క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 19 అధిక ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలపై ఈ అధ్యయనం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ పత్రికలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.
మధుమేహాన్ని నివారించే లేదా ఆలస్యం చేసే విధంగా తగిన ప్రణాళికల అవసరాన్ని ఈ అధ్యయనం గుర్తు చేసింది. స్థూలకాయం , సరైన, సమతులాహారం లేకపోవడం, నిశ్చలమైన జీవితం ఇవన్నీ కూడా టైప్2 మధుమేహం కేసులను పెంచుతున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2021 నాటికి 53.7 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో బాధపడుతున్నట్టు అంచనా. ముఖ్యంగా యువతరంలో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
టైప్2 మధుమేహం కారణంగా సగటున ఆరేళ్లు ఆయుష్షు తగ్గుతుందని లోగడ పలు అధ్యయనాలు వెల్లడించాయి. వాటితో పోలిస్తే తాజా అధ్యయనం రెట్టింపునకు పైగా ఆయుష్షు తగ్గుతుందని చెబుతుండడాన్ని హెచ్చరికగానే పరిగణించాలి. టైప్2 మధుమేహం అన్నది హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ కు దారితీస్తుంది. మధుమేహం రిస్క్ ఉన్న వారిని ముందుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటే దీన్ని నివారించొచ్చని అధ్యయనం చెబుతోంది.