Vladimir Putin: మోదీ తెలివైన నేత: మరోసారి కీర్తించిన రష్యా అధ్యక్షుడు
- మోదీ నాయకత్వంలో భారత్ ఎంతో పురోగతి చెందిందన్న రష్యా అధ్యక్షుడు
- భారత్ తో మంచి సంబంధాలున్నాయంటూ ప్రస్తావన
- గతంలో భారత్ లో తయారీ కార్యక్రమాన్ని మెచ్చుకున్న పుతిన్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి కీర్తించారు. మోదీ నాయకత్వ పటిమను మెచ్చుకున్నారు. ఎంతో తెలివైన నేత అంటూ ప్రశంసించారు. ఓ కార్యక్రమంలో భాగంగా పుతిన్ మాట్లాడిన ప్రసంగం తాలూకూ వీడియోని రష్యా న్యూస్ ప్లాట్ ఫామ్ ఆర్టీ న్యూస్ షేర్ చేసింది. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతిని పుతిన్ ప్రస్తావించారు.
‘‘ప్రధాని మోదీతో మాకు మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎంతో తెలివైన వ్యక్తి. ఆయన నాయకత్వంలో భారత్ అభివృద్ధి పరంగా ఎంతో పురోగతి చెందింది. భారత్, రష్యా ప్రయోజనాలరీత్యా కలసి పనిచేసేందుకు ఈ అజెండా చక్కగా సరిపోతుంది’’ అని పుతిన్ పేర్కొన్నారు. గతంలోనూ పుతిన్ భారత ప్రధాని నాయకత్వాన్ని మెచ్చుకోవడం తెలిసిందే. ముఖ్యంగా భారత్ లో తయారీ కార్యక్రమాన్ని మోదీ గొప్పగా చేస్తున్నారంటూ, రష్యా సైతం అదే విధంగా పనిచేయాలన్నట్టు ఆయన మాట్లాడారు.
ఇటీవలే జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు రావడం చూశాం. ఈ సందర్భంగా చేసిన డిక్లరేషన్ ను ఓ మైలురాయిగా రష్యా సైతం అభివర్ణించింది. రష్యాని నిందించకుండా, ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని పేర్కొనడం వరకే అందులో చోటు ఇచ్చారు. ఇది రష్యాకు సైతం నచ్చింది.