Viral Video: లిఫ్ట్ లో 20 నిమిషాల పాటు విలవిలలాడిపోయిన చిన్నారి.. వీడియో ఇదిగో
- లక్నోలోని గౌరీభాగ్ ప్రాంతంలో ఘటన
- డోర్లు తెరుచుకోని ఆటోమేటిక్ లిఫ్ట్
- లోపలే ఉండిపోయిన పదేళ్ల బాలిక
- బయటపడేందుకు ప్రయత్నిస్తూ, కాపాడాలంటూ ఆర్తనాదాలు
నేడు అన్ని అపార్ట్ మెంట్లలో లిఫ్ట్ కామన్ గా ఉంటోంది. ఈ లిఫ్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలనే విషయం చాలా మందికి తెలియడం లేదు. చిన్న పిల్లలను సైతం ఒంటరిగా లిఫ్ట్ వాడుకునేందుకు అనుమతిస్తున్నారు. దీనివల్ల అనుకోని ప్రమాదం ఎదురైతే ఏంటి పరిస్థితి? అన్న ముందస్తు ఆలోచన కూడా ఉండడం లేదు. ఇందుకు నిదర్శనమే లక్నోలో బుధవారం జరిగిన ఘటన.
గౌరీభాగ్ ప్రాంతంలోని కుర్సీ రోడ్డులో జ్ఞానేశ్వర్ ఎంక్లేవ్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లిఫ్ట్ లో పదేళ్ల వయసున్న చిన్నారి చిక్కుకుపోయి, బయటపడేందుకు విలవిలలాడిపోయింది. గ్రిల్ తో కూడిన మాన్యువల్ లిఫ్ట్ కాదు అది. స్టీల్ తో కూడిన, పూర్తిగా మూసుకుపోయే ఆటోమేటిక్ లిఫ్ట్. లోపలి నుంచి బాలిక ఎంతగా అరిచి మొత్తుకున్నా, బయటకు వినిపించని పరిస్థితి. రెండు చేతులతో లిఫ్ట్ డోర్లు తెరిచేందుకు బాలిక శాయశక్తులా ప్రయత్నించడం గమనించొచ్చు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఎలా గుర్తించారో కానీ, 20 నిమిషాల తర్వాత బాలికను కాపాడారు. ఈ వీడియో క్లిప్ ట్విట్టర్ లో చేరగా, యూజర్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఎలివేటర్ కు కనీసం గ్లాస్ డోర్లు అయినా పెట్టాలని, అప్పుడు లోపలున్న వారి గురించి తెలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. వైర్ లెస్ ఫోన్ లేదంటే లౌడ్ స్పీకర్ లాంటిది అయినా ఉండాలని, దీని ద్వారా మాట్లాడినప్పుడు ఇతరులకు వినపడే విధంగా ఉండాలని మరో యూజర్ సూచించారు.