Asian Games: మొన్నటిదాకా రోజు కూలీ.. ఇప్పుడు ఆసియా క్రీడల్లో పతక విజేత
- ఆసియా క్రీడల రేస్ వాక్‌లో కాంస్యం గెలిచిన యూపీ అథ్లెట్ రామ్‌బాబు
- నిరుపేద కుటుంబంలో పుట్టిన రామ్‌బాబు
- ఉపాధి హామీ కూలీగా, హోటల్లో సర్వర్‌గా పని చేస్తూ ప్రాక్టీస్
ఆసియా క్రీరడల్లో భారత క్రీడాకారులు పతకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 80 పతకాలకు పైగా కైవసం చేసుకొని ఈ క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. స్టార్ అథ్లెట్లతో పాటు పెద్దగా పేరులేని వాళ్లు, ఇన్నాళ్లూ పేదరికం, కష్టాలతో సావాసం చేసిన వాళ్లు కూడా పతకాలతో ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నారు. ఇందులో 35 కిలో మీటర్ల మిక్స్‌డ్ రేస్ వాక్‌లో కాంస్యం సాధించిన రామ్‌బాబు ఒకడు. ఉత్తర్ ప్రదేశ్ వారణాసికి చెందిన అతనిది దీనగాథ. పేద కుటుంబంలో పుట్టిన రామ్ చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్‌పై ఇష్టం పెంచుకున్నాడు.
కానీ, రెండు పూటల తిండి దొరికే పరిస్థితి కూడా లేకపోవడంతో తనకు ఇష్టమైన మారథాన్‌ను వదులుకొని కాస్త సులువగా ఉండే రేస్ వాక్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. దాని కోసం కూడా అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తిండి కోసం రోజువారీ కూలీగా మారాడు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మట్టి పనులు చేశాడు. కరోనా తర్వాత పరిస్థితులు దిగజారడంతో ఓ హోటల్‌లో సర్వర్‌గా కూడా పని చేసి పొట్ట నింపుకున్నాడు. ఇన్ని కష్టాల్లోనూ తన నడకను ఆపకుండా ప్రాక్టీస్ కొనసాగించిన రామ్‌బాబు ఇప్పుడు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతకంతో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా అతని కష్టాలు తీరుతాయో లేదో చూడాలి.