Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మందుల కొరతకు 24 గంటల్లో 24 మంది బలి

24 patients including 12 infants die in Nanded govt hospital in 24 hours

  • నాందేడ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూసిన ఘటన
  • మృతుల్లో 12 మంది శిశువులు
  • ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు
  • ఘటనపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్

మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మందుల కొరత కారణంగా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 12 మంది శిశువులు కూడా ఉన్నారు. నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణం వెలుగు చూసింది. 

80 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి ఒకే ఆసుపత్రి ఉండటంతో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి మందులకు కొరత ఏర్పడినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. ఔషధాలను స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నట్టు తెలిపారు. 

మందుల కొరతకు కన్నబిడ్డలను పొగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ నవజాత శిశువు మరణించాడని ఓ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఈ ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మందుల కొరత కారణంగా శిశువుల మృతి సిగ్గుచేటని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వికాస్ లవాండే మండిపడ్డారు. చిన్నారుల మృతిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ప్రచారం కోసం వేల కోట్లు ఖర్చుచేస్తున్న బీజేపీ సర్కారు పిల్లలకు మాత్రం మందులు కూడా అందించలేక పోయిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఘటనపై తక్షణం దర్యాప్తు జరిపించాలని, సంబంధిత మంత్రులను తొలగించాలని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీయా సూలే డిమాండ్ చేశారు.

More Telugu News