: మగాళ్ళ కంటే మగువల మెమరీయే బెటర్!


నేటికాలంలో అతివలు అన్నిరంగాల్లోనూ పురుషులను సవాల్ చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, అంతరిక్ష యాత్రలు.. ఇలా ఒకటేమిటి, అన్ని అంశాల్లోనూ పురోగతి సాధించారు. 'మగాళ్ళకే పరిమితం' అని ముద్రపడ్డ పనులను సైతం అలవోకగా నిర్వర్తిస్తూ.. కార్యదక్షతలో ఎవరికీ తీసిపోమని చాటుతున్నారు. తాజాగా కొన్ని పరిశోధనల్లోనూ మహిళలే మేటిగా నిలుస్తున్నారు. ఆ కథాకమామీషేంటో చూద్దాం. కొత్త వ్యక్తుల ముఖాలను గుర్తుంచుకునే విషయంలో స్త్రీలు.. మగాళ్ళ కన్నా మెరుగైన మెమరీ పవర్ కలిగి ఉన్నారని కెనడాలోని మెక్ మాస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.

మహిళలు ఓ వ్యక్తితో మాట్లాడుతుండగానే, తమకు తెలియకుండానే ఆ వ్యక్తి ముఖ లక్షణాలను పరిశీలిస్తారట. ముఖ్యంగా ముక్కు, కళ్ళు, చెక్కిళ్ళను చక్కగా గుర్తుంచుకుంటారని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న జెన్నిఫర్ హీస్జ్ తెలిపారు. ఎదుటి వ్యక్తి ముఖాన్ని పరికించే వేళ.. కళ్ళ కదలికల తీరునుబట్టి ఆ ముఖాన్ని మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకోవడం సాధ్యమవుతుందని ఆమె వివరించింది.

ఇక, పరిశోధనలో భాగంగా కొందరు వ్యక్తులకు కంప్యూటర్లో కొన్ని ముఖాలను చూపించారు. ఆ ఫొటోల కింద పేర్లు కూడా రాశారు. ఈసారి సదరు ఫొటోలను పేర్లు లేకుండా చూపించారు. వాటిని జ్ఞాపకం చేసుకుని వ్యక్తుల పేర్లు చెప్పాల్సిందిగా సూచించగా.. మహిళలే చక్కగా ముఖాలను గుర్తించారట. ఈ అధ్యయనంలో ఐ-ట్రాకింగ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారి కళ్ళ కదలికలను పరిశీలించినట్టు హీస్జ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News