Pawan Kalyan: కురుక్షేత్రం ప్రారంభమైందని సీఎం అంటున్నాడు... ఓడిపోయేది వాళ్లే: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Avanigadda

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి విజయయాత్ర
  • అవనిగడ్డలో భారీ బహిరంగ సభకు హాజరైన పవన్ కల్యాణ్
  • 100 మందికి పైగా ఉన్న వైసీపీ వాళ్లే కౌరవులని విమర్శలు
  • ఈసారి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని వెల్లడి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రలో భాగంగా నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, నిన్న ఈ ముఖ్యమంత్రి కురుక్షేత్రం ప్రారంభమైందని అన్నాడని, కానీ కౌరవులు వాళ్లేనని, ఓడిపోయేది కూడా వాళ్లేనని పవన్ పేర్కొన్నారు. 100 మంది పైగా ఉన్న వైసీపీ వాళ్లే కౌరవులని, కాబట్టి వాళ్లు ఓడిపోవడం, తాము అధికారంలోకి రావడం ఖాయం, డబుల్ ఖాయం అని వ్యాఖ్యానించారు. 

అవనిగడ్డ అంటే డీఎస్సీ శిక్షణకు ఆయువుపట్టు వంటిదని, ఏపీలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అభ్యర్థులు వేలకు వేలు ఖర్చుపెట్టి సన్నద్ధమైనా, ఇంతవరకు డీఎస్సీ జాడేలేదని మండిపడ్డారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోలేదని, ఎవరికీ న్యాయం చేయలేదని ఆరోపించారు. 

"ఇది పింగళి వెంకయ్య గారికి జన్మనిచ్చిన నేల... దేశానికి జాతీయ పతాకాన్ని ఇచ్చిన నేల. 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను... అనుభవం సంపాదించాను... మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని నిలబడ్డాను. నేను 2014లో బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చాను. కానీ, కొన్ని హామీల విషయంలో, ప్రత్యేక హోదా అంశంలో వారితో విభేదించి బయటికి వచ్చాను. హామీల పైనా, ప్రజాసమస్యల పైనా నేను అంత నిబద్ధతతో ఉంటాను. ఇవాళ ప్రత్యేక పరిస్థితుల వల్ల వారికి మద్దతుగా నిలుస్తున్నాం. 

ఏపీ భవిష్యత్తు దృష్ట్యా ఈసారి ఓటు చీలనివ్వకూడదు... వైసీపీని దించేయడమే మా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. గత ఎన్నికల్లో నేను గెలిచుంటే ఇవాళ డీఎస్సీ అభ్యర్థులు ఇలా ప్లకార్డులు పట్టుకుని నిలుచోవాల్సిన అవసరం వచ్చేది కాదు. 

జగన్ వేల కోట్లు దోచేసిన తర్వాత కూడా ఇంకా దోచుకుంటూనే ఉన్నాడు. మీ వద్ద డబ్బులు ఉండకూడదని మీకు ఉద్యోగాలు ఇవ్వడు... నా దగ్గర డబ్బులు ఉండకూడదని నా సినిమాల టికెట్లు 5 రూపాయలు చేస్తాడు... అందరూ తన వద్ద దేహీ అనాలన్నది జగన్ ఆలోచన. 

జగన్ వంటి అధికార మదంతో ఉన్న వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. కానీ నా వద్ద ఓట్లు కొనడానికి డబ్బులు లేవు. దయచేసి రూ.500కి, రూ.2 వేలకు ఓట్లు వేయకండి... ఈ ఒక్కసారి ఆలోచించండి. వేల కోట్లు ఉన్న వ్యక్తితో, ప్రైవేటు సైన్యం కలిగిన వ్యక్తితో, అనుభవజ్ఞులైన నేతలను కూడా జైలుకు పంపిన వ్యక్తితో నేను తలపడుతున్నాను... దీన్నిబట్టే అర్థం చేసుకోండి మీ కోసం నేను ఎంత బలంగా నిలబడుతున్నానో. 

నేను డబ్బు తీసుకున్నానని వైసీపీ సన్నాసులు వాగుతున్నారు. వీళ్లు డబ్బులు తీసుకుంటారు కాబట్టి నేను కూడా డబ్బులు తీసుకుంటానని అనుకుంటున్నారు. ఇదంతా పచ్చకామెర్ల వ్యవహారం. నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో పార్టీ నడుపుతున్నాను. కేవలం డబ్బు సంపాదించాలన్న ఆశ ఉంటే మాదాపూర్ ఏరియాలో 10 ఎకరాలు కొనేవాడ్ని. నా దృష్టంతా ప్రజలపైనే. రేపు ఎన్నికల్లో గెలిచి నాకు సీఎం పదవి వచ్చినా, ఇంకే పదవి వచ్చినా నా ఆలోచన అంతా అభివృద్ధి గురించే" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Pawan Kalyan
Avanigadda
Varahi Vijaya Yatra
Janasena
  • Loading...

More Telugu News