Uttar Pradesh: మహిళా ఎమ్మెల్యేను అసభ్యకరంగా తాకిన ఎంపీ
- ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జిల్లా కోల్ ప్రాంతంలో ఘటన
- దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు
- వేదికపై ఉన్న మహిళా ఎమ్మెల్యే భుజాలపై అభ్యంతరకర రీతిలో చేతులేసిన ఎంపీ సతీశ్ గౌతమ్
- ఎంపీ తీరుతో ఇబ్బంది పడ్డ ఎమ్మెల్యే, దూరంగా వెళ్లి కూర్చున్న వైనం
- ఎంపీపై జనాల ఆగ్రహం, నెట్టింట వెల్లువెత్తుతున్న విమర్శలు
ఓ మహిళా ఎమ్మెల్యేను ఎంపీ అభ్యంతరకరంగా తాకిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎంపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జిల్లా కోల్ ప్రాంతంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. కోల్ ఎమ్మెల్యే అనిల్ పరాశర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్, మాజీ మేయర్ శకుంతల భారతీ, బీజేపీ కార్యనిర్వహక సభ్యురాలు పూనమ్ బజాజ్, జిల్లా పంచాయతి ప్రెసిడెంట్ విజయ్ సింగ్ వేదికపై కూర్చున్నారు.
ఈ సందర్భంగా వేదికపై ఉన్న బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ తన పక్కనే కూర్చున్న మహిళా ఎమ్మెల్యే భూజాల చుట్టూ చేతులేసి ఆమెను కదిపారు. దీంతో ఎమ్మెల్యే ఇబ్బందిగా ఫీలైయ్యారు. పక్కనే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ జైవీర్ సింగ్ ఇదంతా గమనించినట్టు కూడా కెమెరాల్లో చిక్కింది. ఎంపీ చర్యలతో ఇబ్బంది పడ్డ మహిళా ఎమ్మెల్యే ఆ తరువాత ఎంపీకి దూరంగా వెళ్లి మరో సీటులో కూర్చున్నారు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.