- అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లో వాటాల అమ్మకం
- కొనుగోలుదారుతో ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించిన ఐహెచ్ సీ
- ఇన్వెస్ట్ చేసిన ధర కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న షేర్లు
అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన 18 నెలల్లోనే అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్ సీ (ఐహెచ్ సీ) భారీ నష్టాలకు విక్రయించనుంది. ఈ సంస్థ 18 నెలల క్రితం మూడు అదానీ గ్రూపు కంపెనీల్లో రూ.15,400 కోట్లు (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ.3,850 కోట్లు, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లో రూ.3,850 కోట్లు, అదానీ ఎంటర్ ప్రైజెస్ లో రూ.7,700 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసింది.
ఇప్పుడు అదానీ గ్రీన్ లో తనకున్న 1.26 శాతం వాటా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లో 1.41 శాతం వాటాను విక్రయించనున్నట్టు అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కు సమాచారం ఇచ్చింది. ఈ రెండు కంపెనీల్లో తనకున్న పెట్టుబడులను విక్రయించేందుకు వ్యూహాత్మక కొనుగోలుదారుతో ఒప్పందానికి వచ్చినట్టు తెలిపింది. ఎంత విలువకు విక్రయించేదీ వెల్లడించలేదు. కాకపోతే ఐహెచ్ సీ ఇన్వెస్ట్ చేసిన దానితో పోలిస్తే, ఈ రెండు కంపెనీలు చాలా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో భారీ నష్టానికే విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ లో ఈ సంస్థకు 3.53 శాతం వాటా ఉంది. దీని విలువ ప్రస్తుతం రూ.9,937 కోట్లు. రూ.7,700 కోట్ల పెట్టుబడిపై చూసుకుంటే 29 శాతం లాభాలు కనిపిస్తున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ లో వాటాల విక్రయానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలను ప్రకటించలేదు.
అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు ఉన్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ ఈ ఏడాది జనవరిలో నివేదిక విడుదల చేయడం తెలిసిందే. ఈ ఆరోపణలను సంస్థ ఖండించింది. అనంతరం అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పడిపోయి, తర్వాత కొంత కోలుకున్నాయి. కానీ, ఇప్పటికీ అదానీ ఎనర్జీ ఈ ఏడాది జనవరి గరిష్ఠ ధర నుంచి 47 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సైతం 70 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది.