London Bridge: పైకి తెరిచాక మొరాయించిన లండన్ బ్రిడ్జ్.. అద్భుత ఘట్టమే అయినా గందరగోళం!
- బోటు వెళ్లేందుకు తెరుచుకున్న బ్రిడ్జి
- ఆ తర్వాత మూసుకోకపోవడంతో నిలిచిపోయిన ట్రాఫిక్
- అరగంట తర్వాత తిరిగి యథాస్థానానికి వంతెన
- బ్రిడ్జి మూసుకోవడంతో ఆనందంతో కేరింతలు
థేమ్స్ నదిపై ఉన్న ప్రతిష్ఠాత్మక లండన్ టవర్ బ్రిడ్జి తెరుచుకుంటున్నప్పుడు చూడాలని పర్యాటకులు ఉబలాటపడుతుంటారు. నిన్న కూడా బ్రిడ్జ్ తెరుచుకుంది. కిందనుంచి వెళ్తున్న ఓ బోటుకు దారిచ్చింది. అయితే, ఆ తర్వాత మూసుకోవడానికి మొరాయించడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్న మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ ఘటన జరిగింది. మొత్తానికి పలు ప్రయత్నాల అనంతరం దాదాపు అరగంట తర్వాత పైకి తెరుచుకున్న బ్రిడ్జిని కిందికి దింపి యథాస్థానానికి తేగలిగారు.
తెరుచుకున్న బ్రిడ్జి చూడ్డానికి చాలా బాగుందని, అయితే అది తిరిగి మూసుకోకపోవడంతో గందరగోళం ఏర్పడిందని, టూరిస్టు బస్సులు సహా పలు వాహనాలు నిలిచిపోయాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బ్రిడ్జి మూసుకున్నాక మాత్రం జనం చప్పట్లు, కేరింతలతో తమ సంతోషాన్ని పంచుకున్నారని పేర్కొన్నారు. హైడ్రాలిక్ సమస్య కారణంగా ఈ ఘటన జరిగినట్టు స్థానిక పత్రికలు తెలిపాయి.