Nitin Gadkari: ఇకపై జాతీయ హైవేలపై గుంతలుండవు: నితిన్ గడ్కరీ
- హైవేలపై గుంతలు నివారించేందుకు రహదారుల శాఖ చర్యలు తీసుకుంటుందని వెల్లడి
- ఇందుకు కొత్త పాలసీ తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి
- మున్సిపల్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించే విధానం తెస్తామన్న గడ్కరీ
ఈ ఏడాది డిసెంబర్ నాటికి జాతీయ రహదారులను గుంతలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. హైవేలు గుంతలు లేకుండా ఉండేలా తమ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. పనితీరు ఆధారిత నిర్వహణ, స్వల్పకాలిక నిర్వహణ ఒప్పందాలను పటిష్ఠం చేస్తోందని ఆయన చెప్పారు. బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్ (బీవోటీ) పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. అటువంటి ప్రాజెక్టులు రోడ్లను మెరుగైన పద్ధతిలో నిర్వహిస్తున్నాయని చెప్పారు. వర్షాల వల్ల హైవేలు దెబ్బతిని, గుంతలు ఏర్పడుతాయని దీన్ని అరికట్టేందుకు కొత్త పాలసీని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.
జాతీయ రహదారుల వెంబడి డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కూడా పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. మరోవైపు మునిసిపల్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేందుకు ప్రభుత్వం మరో జాతీయ విధానాన్ని కూడా రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో వాటాదారులందరితో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. వ్యర్థాలు దేశానికి పెద్ద సమస్య అని, ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే దేశానికి ప్రయోజనం చేకూరుతుందని గడ్కరీ అన్నారు. 2070 నాటికి సున్నా వ్యర్థాలు (నెట్ జీరో) అనే ప్రధానమంత్రి దార్శనికతను సాధించేందుకు ఈ విధానం భారత్‌కు దోహదపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.