Karnataka Bandh: కర్ణాటకలో కొనసాగుతున్న బంద్.. మూతబడిన విద్యాసంస్థలు.. రోడ్డెక్కని ఆటోలు, ట్యాక్సీలు
- తమిళనాడుకు కావేరీ జలాల విడుదలపై నిరసన
- బంద్‌కు పిలుపునిచ్చిన కన్నడ అనుకూల సంస్థలు
- రాష్ట్రవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ అనుకూల సంస్థలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమ్తతమైన పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో వివిధ సంస్థలకు చెందిన 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రవాణా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. బెంగళూరులో విద్యాసంస్థలు, హోటళ్లు, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు సహా ఏవీ తెరుచుకోలేదు. ట్యాక్సీ, ఆటో సర్వీసులు కూడా నిలిచిపోయాయి. నగరంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు.
కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలవాలి (వటల్ పక్ష) సహా ఇతర రైతు సంఘాలతో కూడిన కన్నడ ఒక్కుట సంస్థ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. హైవేలు, టోల్‌గేట్లు, రైలు సర్వీసులు, విమానాశ్రయాల వద్ద నిరసనకారులు అడ్డుకునే ప్రమాదం ఉండడంతో ఆయాచోట్ల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.