Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రోహిత్ శర్మ.. మరో ప్రపంచ రికార్డుకు చేరువలో!

Rohit Sharma close to world record of highest Sixes

  • ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 6 సిక్సర్లతో విరుచుకుపడ్డ రోహిత్
  • అంతర్జాతీయ క్రికెట్లో లో 553 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్
  • ఇప్పటి వరకు 551 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ

నిన్న ఆస్ట్రేలియాతో రాజ్ కోట్ లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరోవైపు లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసిన తరుణంలో... ఓ అద్భుతమైన క్యాచ్ కు ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ నుంచే రోహిత్ దూకుడును ప్రదర్శించాడు. రోహిత్ విరుచుకుపడటంతో తొలి పవర్ ప్లేలోనే ఇండియా 72 పరుగులు సాధించింది. 31 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 13 ఏళ్ల తర్వాత పవర్ ప్లేలో 50కి పైగా పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. చివరి సారిగా 2010లో ఈ ఫీట్ ను గౌతమ్ గంభీర్ సాధించాడు. మొత్తం మీద ఈ ఘనతను వీరేంద్ర సెహ్వాగ్ 7 సార్లు సాధించగా... సచిన్, గంభీర్, రాబిన్ ఊతప్ప, రోహిత్ శర్మ ఒక్కోసారి సాధించారు. 

మరోవైపు నిన్నటి మ్యాచ్ లో 6 సిక్సర్లతో స్టేడియంను రోహిత్ హోరెత్తించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ లో 551 సిక్సర్లను సాధించాడు. రోహిత్ కంటే ముందు కేవలం క్రిస్ గేల్ మాత్రమే ఉన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో క్రిస్ గేల్ 553 సిక్సర్లను బాదాడు. మరో 3 సిక్సర్లు బాదితే... అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును సృష్టిస్తాడు. వన్డేల్లో ఒక మ్యాచ్ లో 5కి పైగా సిక్సర్లు బాదడం రోహిత్ కు ఇది 17వ సారి. టీమిండియా తరపున సచిన్ 8 సార్లు, గంగూలీ 7 సార్లు, సెహ్వాగ్ 6 సార్లు, ధోనీ 5 సార్లు ఈ ఫీట్ ను సాధించారు.

More Telugu News