KTR: హైదరాబాదులో అతిపెద్ద మాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR inaugurates Lulu shopping mall in Hyderabad
  • హైదరాబాదులో రూ.300 కోట్లతో భారీ షాపింగ్ మాల్ 
  • కేపీహెచ్ బీ ఏరియాలో ఏర్పాటు చేసిన లులూ గ్రూప్
  • లులూ గ్రూప్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
లులూ గ్రూప్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన అతి పెద్ద షాపింగ్ మాల్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సూపర్ షాపింగ్ మాల్ ను రూ.300 కోట్లతో కేపీహెచ్ బీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేరళ నుంచి యూఏఈ వెళ్లిన యూసుఫ్ అలీ లులూ గ్రూప్ స్థాపించి 25 దేశాలకు విస్తరించారని వెల్లడించారు. 270 హైపర్ మార్ట్ లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు. 

అంతర్జాతీయ వేదికలపై లులూ గ్రూప్ అధినేతలు తమను కలిసినప్పుడు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపారని కేటీఆర్ తెలిపారు. సరళీకృత విధానాలతో తమకు ఆహ్వానం పలికితే, తప్పకుండా పెట్టుబడులు పెడతామని మాటిచ్చారని, ఆ ప్రకారమే హైదరాబాదులో భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారని వివరించారు. 

ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగంలోనూ పెట్టుబడులకు లులూ గ్రూప్ ఆసక్తిగా ఉందని, తెలంగాణలో ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, రైతులకు, చేపల సాగుదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. 

ఈ క్రమంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులకు లులూ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఈ సందర్భంగా లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కేటీఆర్ వెల్లడించారు. పేర్కొన్న దానికంటే ఎక్కువగానే పెట్టుబడులు పెడతారని ఆశిస్తున్నామని తెలిపారు. తెలంగాణను వేదికగా చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని, మరెన్నో దేశాలకు విస్తరించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
KTR
Lulu
Shopping Mall
KPHB
Hyderabad
Telangana

More Telugu News