Mama Mascheendra: చూస్తుంటే ఈ సినిమా అదిరిపోయే హిట్టు కొట్టేట్టుంది: మహేశ్ బాబు

Mahesh Babu launches Mama Mascheendra trailer

  • నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో మామా మశ్చీంద్ర
  • మూడు గెటప్పుల్లో నటించిన సుధీర్ బాబు
  • ట్రైలర్ విడుదల చేయడం సంతోషాన్నిచ్చిందన్న మహేశ్ బాబు
  • సినిమా హిట్టవడం ఖాయం అంటూ ఆశీర్వదించిన సూపర్ స్టార్

సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళిని రవి ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మామా మశ్చీంద్ర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నటుడు/రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.'మామా మశ్చీంద్ర' సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు లాంచ్ చేశారు. 

తన బావ సుధీర్ బాబు నటించిన చిత్రంపై మహేశ్ బాబు స్పందిస్తూ, ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. చూస్తుంటే ఈ సినిమా అదిరిపోయే విజయం అందుకునేలా ఉందని అభిప్రాయపడ్డారు. హీరో సుధీర్ బాబుకు, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ ఎక్స్ లో స్పందించారు. 'మామా మశ్చీంద్ర' చిత్రం ట్రైలర్ వీడియో లింకును కూడా మహేశ్ బాబు పంచుకున్నారు. 

సృష్టి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ట్రైలర్ చూస్తే... సుధీర్ బాబు మూడు గెటప్పుల్లో  కనిపిస్తారని తెలుస్తోంది. ఒకటి ఓల్డ్ మ్యాన్ గెటప్ కాగా... కవలలుగానూ సుధీర్ బాబు కనువిందు చేయనున్నారు. 

ఓల్డ్ మ్యాన్ కు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారిద్దరూ కవలలను ఇష్టపడుతుంటారు. అయితే ఇది నచ్చని ఓల్డ్ మ్యాన్ ఏంచేశాడన్నదే కథాంశం. ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఉన్న సుధీర్ బాబు మేనమామ అని, అచ్చం అతడిలానే ఉండే కవలలు అతడి మేనల్లుళ్లే అని తెలుస్తోంది. తమ తండ్రి పోలికలతో కనిపించే కవల యువకులతో అక్కాచెల్లెళ్లు ప్రేమలో పడడం చూస్తుంటే ఈ సినిమాలో వినోదానికి లోటు ఉండదనిపిస్తోంది.

More Telugu News