Ayyanna Patrudu: మనిషిగా పుట్టినవారు ఎవరైనా అలా మాట్లాడతారా?: కొడాలి నానిపై అయ్యన్న నిప్పులు
- కొడాలి నాని ఎప్పుడైనా తన శాఖ గురించి మాట్లాడారా? అని నిలదీత
- సంస్కారం ఉన్నవాళ్లు అలాగే మాట్లాడతారా? అని దుయ్యబట్టిన అయ్యన్న
- మీ నాయకుడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడని విమర్శలు
- నీ పెంపుడు కుక్కలకు చెప్పమని జగన్ కు సూచన
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎంతసేపూ చంద్రబాబును విమర్శించడం, ఆయన సతీమణి భువనేశ్వరిని, కుటుంబ సభ్యులను విమర్శించడం తప్ప కొడాలి నానికి ఇంకేం పని ఉందన్నారు. ఆయన తన శాఖ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.
ప్రజలకు పనికొచ్చే పని చేశావా? అధికారాన్ని ఉపయోగించుకొని పేకాట క్లబ్బులు వంటి వాటితో డబ్బులు సంపాదించుకోవడం తప్ప, నీ శాఖపరంగా మంచి చేశావని చెప్పగలవా? అని నిలదీశారు.
మనిషిగా పుట్టినవారు ఎవరైనా అలా మాట్లాడతారా? సంస్కారం ఉన్నవాళ్లు అలా మాట్లాడతారా? ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఇలా దిగజారి మాట్లాడుతారా? అని నిలదీశారు. ఈరోజు చంద్రబాబు గురించి ఎన్నో దేశాలవారు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఏపీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారని, నీలాంటి సన్నాసులకు అది కనిపించదని కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు. మా పార్టీ అధినేతపై మీరు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి మీ నాయకుడు జగన్ అయితే, ఏ తప్పు చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడ్డ వ్యక్తి చంద్రబాబు అన్నారు.
ఓ వ్యక్తిపై ఇష్టం లేకుంటే జైల్లో వేస్తారా? అన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. మీ నాయకుడు దొంగ... ముఖ్యమంత్రి అంటూ కొడాలి నానిని ఉద్ధేశించి అన్నారు. జగన్ ఈ రోజు పాదయాత్ర చేయగలడా? అన్నారు. ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తే అందరూ అడ్డుకుంటారన్నారు.
'జగన్! నీ పెంపుడు కుక్కలకు బుద్ధి చెప్పు, అయినా నీకే బుద్ధి లేదు వారికేం చెబుతావులే' అని ఎద్దేవా చేశారు. వైసీపీలోనూ కొంతమంది పెద్దలు ఉన్నారని, వారు ఆలోచించాలన్నారు. చంద్రబాబు అకౌంట్లోకి ఒక్క రూపాయి అక్రమంగా వచ్చినట్లు నిరూపించగలరా? అని సవాల్ చేశారు.
చంద్రబాబు ఇప్పటికీ తమకు న్యాయపరంగా, ధర్మంగా వెళదామని చెబుతున్నారని, రాష్ట్రం కోసం ఆలోచించుదామని తమకు సూచనలు చేస్తున్నారన్నారు. శాంతియుత నిరసనలు వ్యక్తం చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటన్నారు. పిరికితనం, చేతకానితనంతో తమను అడ్డుకుంటున్నారన్నారు. తాను యువగళం పాదయాత్రను ప్రారంభిస్తానని లోకేశ్ నిన్న చెప్పగానే, ఈ పిరికివారు రాజమండ్రి బ్రిడ్జి రిపెయిర్ అంటూ అక్టోబర్ వరకు ఆపే ప్రయత్నం చేశారన్నారు. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు రోడ్డు మీద నిలబెట్టి కొడతారన్నారు.
కొడాలి నాని గురించి ప్రజలందరికీ తెలుసునని, ఆయనను గుట్కాగాడు అంటారని, ఆయనకు సిగ్గులేదన్నారు. అలాంటి పరిస్థితి మాకు వస్తే కనీసం రోడ్డు పైన నడిచేవారం కాదన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ మోకాలి నీళ్లతో బతికినవాడివి నువ్వు అని కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. హరికృష్ణతో పైకి వచ్చి, ఇప్పుడు అదే కుటుంబాన్ని భూస్థాపితం చేయాలనుకుంటున్నావని, నీలాంటి సన్నాసులు ఎక్కడైనా ఉంటారా? అన్నారు. గుడివాడ ప్రజలు సన్నాసిని గెలిపించుకోవద్దని, మంచి వ్యక్తిని గెలిపించుకోవాలన్నారు. గుడివాడ నాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. మా తప్పులు ఉంటే సంస్కారవంతంగా మాట్లాడు.. కానీ ఇష్టారీతిన మాట్లాడితే ఆడవారు చెప్పుతీసి కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. భర్త జైల్లో ఇబ్బంది పడుతుంటే భార్యగా భువనేశ్వరి చెప్పుకుంటే తప్పా? అన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అన్నారు. నీకు, మీ పార్టీకి రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.