KTR: గవర్నర్ గారూ! మీకు రాజకీయాలతో సంబంధం లేదా?: కేటీఆర్ ప్రశ్న

Minister KTR lashes out at governor

  • ఉద్యమంలో పాల్గొన్న వారినే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశామన్న కేటీఆర్
  • గవర్నర్ తీరును ఖండిస్తున్నామని వ్యాఖ్య 
  • ఎవరిని నామినేట్ చేయాలన్నది ప్రభుత్వం ఇష్టమని వెల్లడి 
  • అసలు దేశానికి గవర్నర్ పోస్టులు అవసరమా? అని ప్రశ్న
  • కిషన్ రెడ్డి అసమర్థుడు.. మోస్ట్ అన్ ఫిట్ లీడర్ అంటూ ఆగ్రహం
  • వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజకీయ గిమ్మిక్కు అని ఆరోపణ

ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడంపై మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కేటిఆర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... మీకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవా? అని గవర్నర్‌ను ప్రశ్నించారు. ఆమె గవర్నర్ కాకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారని గుర్తు చేశారు. ఆమె సరిగ్గా ఆలోచించి ఉంటే తిరస్కరించకపోయి ఉండేవారన్నారు. ఉద్యమంలో పాల్గొన్న దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తాము నామినేట్ చేశామన్నారు.

సామాజిక కార్యక్రమాలు లేవంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. గవర్నర్ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరిని నామినేట్ చేయాలనేది తమ ఇష్టమన్నారు. అసలు దేశానికి గవర్నర్ వంటి పోస్టులు అవసరమా? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. గవర్నర్ కు పై నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ని, జ్యోతిరాదిత్య సింధియా తదితరులను రాజ్యసభకు ఎలా పంపించారో చెప్పాలన్నారు. కర్ణాటకలో మంత్రిగా పని చేసిన మహిళను ఎమ్మెల్సీగా చేశారని చెప్పారు. ఇలా ఒక్కరిని కాదు... ఎంతోమందిని పెద్దల సభకు పంపించారన్నారు. అందరు అర్జున అవార్డు గ్రహీతలకు ఇవ్వాలంటే మీ రాష్ట్రంలో ఎందరికి ఇచ్చారో చెప్పాలన్నారు. గవర్నర్ కు మరోసారి ఎమ్మెల్సీల పేర్లను ప్రతిపాదిస్తూ పంపిస్తామన్నారు. మేడమ్‌కు తమ మీద ఎంత కోపం ఉన్నా శ్రవణ్ మీద ఉండదని భావించామన్నారు. సర్కారియా కమిషన్ ను తుంగలో తొక్కారన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పగ బట్టాయని ఆరోపించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆయన అసమర్థుడు... మోస్ట్ అన్ ఫిట్ లీడర్ అని విమర్శించారు. ఉద్యమం సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయాడన్నారు. కనీసం సొంత నియోజకవర్గంలో ఇన్నేళ్లయినా ఫ్లైఓవర్ కట్టనివాడు అని విమర్శించారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజకీయ గిమ్మిక్కు అని ఆరోపించారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఏం చేశారో చెప్పాలన్నారు.

KTR
Governor
Tamilisai Soundararajan
Dasoju Sravan
BRS
BJP
  • Loading...

More Telugu News