Saudi Arabia: సౌదీలో 17 ఏళ్ల విద్యార్థినికి 18 ఏళ్ల జైలు
- రాజకీయ ఖైదీలకు మద్దతుగా ట్వీట్ చేసిన విద్యార్థిని
- ఒక్క ట్వీట్ కు భారీ శిక్ష విధించిన సౌదీ అరేబియా
- సోషల్ మీడియా వాడకంపై గల్ఫ్ దేశాల్లో ఆంక్షలు
గల్ఫ్ దేశాలలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చాటిచెప్పే మరో ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఒకే ఒక్క ట్వీట్ ఓ స్కూలు విద్యార్థినిని 18 ఏళ్ల పాటు జైలులో మగ్గేలా చేసింది. అంతకుముందు యూట్యూబ్ లో చేసిన ఓ కామెంట్ కు గానూ ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాపై గల్ఫ్ దేశాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, కామెంట్లు చేసేవారికి కఠిన శిక్షలు తప్పవు. తాజాగా జరిగిన స్కూలు విద్యార్థిని ఉదంతానికి వస్తే..
సౌదీ అరేబియాలో పదిహేడేళ్ల స్కూలు విద్యార్థిని ఒకరు రాజకీయ ఖైదీలకు మద్దతుగా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కారణంగా సదరు విద్యార్థినిని సౌదీ అధికారులు దీర్ఘకాలం జైలుకు పంపించారు. శిక్ష విధించిన విద్యార్థిని వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనని సౌదీలో మానవ హక్కుల ఉల్లంఘనలను డాక్యుమెంట్ చేసే ఏఎల్‌క్యూఎస్‌టీ హక్కుల సంఘం శుక్రవారం వెల్లడించింది. ప్రభుత్వాన్ని విమర్శించడానికి సోషల్ మీడియాను ఉపయోగించడంపై సౌదీ న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు విధిస్తోంది.
యూట్యూబ్ లో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విశ్రాంత అధ్యాపకుడు మొహమ్మద్ అల్ గమ్డీకి ఇటీవల మరణశిక్ష విధించింది. లీడ్స్ యూనివర్సిటీ డాక్టరేట్ స్టూడెంట్, మహిళా హక్కుల కార్యకర్త సల్మా అల్ షెహాబ్ కు గతేడాది 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యునైటెడ్ కింగ్ డమ్ లో నివసిస్తున్న సల్మా 2021 లో హాలిడే ట్రిప్ కోసం సౌదీకి వెళ్లగా.. అక్కడి అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. గతేడాది ఆమెకు శిక్ష విధిస్తూ సౌదీ న్యాయస్థానం తీర్పు చెప్పింది.