Bellapu Sohan Singh: రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన సోహన్‌సింగ్ కన్నుమూత
- గుండెనొప్పితో కన్నుమూసిన సోహాన్‌సింగ్
- హోమియోపతిలో పలు పరిశోధనలు
- ఆయన వద్ద జనం బారులు
- రామాంతపూర్ ప్రభుత్వ హోమియో కాలేజీలో సొంతఖర్చులతో గదుల నిర్మాణం
రూ. 20కే హోమియోపతి వైద్యం అందించిన ప్రముఖ హోమియోపతి వైద్యుడు బెల్లపు సోహన్‌సింగ్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి గుండెనొప్పితో బాధపడిన ఆయనను వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు. ఆయనకు భార్య విమల, కుమార్తె నీలిమ ఉన్నారు. కుమారుడు ధర్మకిరణ్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
కృష్ణా జిల్లాలోని రావులపాలెంలో జన్మించిన సోహాన్‌సింగ్ ఎంబీబీఎస్‌లో సీటు రాకపోవడంతో హోమియోపతిలో చేరారు. అప్పటికి హోమియోపతికి అంత ఆదరణ లేదు. అందులో ఎన్నో పరిశోధనలు చేశారు. కుమారుడి పేరుపై రామాంతపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కాలేజీలో సొంత ఖర్చులతో గదులను నిర్మించారు. రూ. 20కే హోమియోపతి వైద్యం అందించారు. తెల్లవారుజామునుంచే ఆయన క్లినిక్ వద్ద రోగులు బారులు తీరేవారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించడంలో పేరు సంపాదించారు.