YS Sharmila: దొర! పాలన చేతకాలేదు... క్షమాపణలు చెప్పు: కేసీఆర్‌పై వైఎస్ షర్మిల

YS Sharmila demand for KCR apology

  • తొమ్మిదేళ్లు గడిచినా ఒక్క నోటిఫికేషన్ పూర్తి కాలేదని విమర్శ
  • ఉద్యమం సమయంలో రెచ్చగొట్టిన దొర ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని వ్యాఖ్య
  • మీకు తెలిసిందల్లా పేపర్లు లీకులు చేయడమేనని ఎద్దేవా

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా ఒక్క నోటిఫికేషన్ పూర్తి కాలేదన్నారు. ఉద్యమం సమయంలో రెచ్చగొట్టిన దొర ఇప్పుడు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు.

ఉద్యమంలో గ్రూప్-1 రాయకండి, మనయ్ మనమే రాసుకుందమని రెచ్చగొట్టిన దొరా... స్వరాష్ట్రంలో పెద్ద కొలువులు ఎక్కడకు వెళ్లాయి? అని ప్రశ్నించారు. ఊరించి ఊరించి 9 ఏళ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ గట్టు దాటక పాయె అన్నారు. ఒక్కరికీ కూడా ఉద్యోగం రాలేదన్నారు. 503 పోస్టులకు రెండుసార్లు పరీక్షలు జరిగి రద్దైన ఘటన.. బహుశా దేశంలోనే మీ అసమర్థ విధానాలకు ఒక  దర్పణమని ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. పాలన చేతకాదనడానికి ఇది నిదర్శనమన్నారు.

మీకు తెలిసిందల్లా పేపర్లు లీకులు చేయడమేనని, సంతలో కూరగాయలు అమ్మినట్లు అమ్మడమేనని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీకి విశ్వసనీయత లేదని చెప్పినా.. దర్యాప్తు జరుగుతున్నప్పుడు పాత బోర్డుతో పరీక్షలు వద్దని మొత్తుకున్నా.. బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు ఎత్తివేశారని నెత్తీ నోరు బాదుకున్నా.. పట్టింపు లేకుండా పరీక్షలు పెట్టారని, కానీ ఈ రోజు హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అన్నారు. ఆనాడే లీకుల సూత్రధారులను పక్కన పెట్టి ఉంటే నిరుద్యోగుల డిమాండ్లను గౌరవించి ఉంటే, పకడ్బందీగా పరీక్షల నిర్వహించి ఉంటే, ఇవ్వాళ మరోసారి 2.37 లక్షల మంది గ్రూప్ 1 అభ్యర్థులకు నష్టం జరిగి ఉండేది కాదన్నారు. నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News