Botsa Satyanarayana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారంపై బొత్స సత్యనారాయణ విమర్శలు
- చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు అన్న పోచారం
- పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న బొత్స
- ఒక రిమాండ్ ఖైదీ గురించి ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ను తెలంగాణలోని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా ఖండిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్ట్ కరెక్ట్ కాదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని విమర్శించారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు.
పోచారం వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. పోచారం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ పదివిలో ఉంటూ చంద్రబాబు అరెస్ట్ సరికాదన్న పోచారం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. రిమాండ్ లో ఉన్న ఒక ఖైదీ గురించి ఇలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. మీ సీఎం కేసీఆర్ ను అడిగితే ఆయనే చెపుతారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడొచ్చని, కానీ వ్యవస్థలను తాకట్టు పెట్టేలా మాత్రం మాట్లాడకూడదని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు అవినీతి రహితంగా పాలన చేయాలని అన్నారు.