Atchannaidu: శాసనసభ సాక్షిగా ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వడానికి స్పీకర్ ప్రయత్నించారు: అచ్చెన్నాయుడు
- నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం
- చంద్రబాబు అరెస్ట్ అంశంపై సభలో ఉద్రిక్త పరిస్థితులు
- టీడీపీ సభ్యుల సస్పెన్షన్
- మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు తదితరులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, సభా సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీడీపీ సభ్యులు పోడియంను ముట్టడించడం, మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు, టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తదితర వాడీవేడి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ అయిన అనంతరం, అచ్చెన్నాయుడు తదితర టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.
17 మందికి సమాధానం చెప్పలేకపోయారంటూ అచ్చెన్నాయుడు అధికార పక్షంపై ధ్వజమెత్తారు. 200 మంది మార్షల్స్ సాయంతో నచ్చినట్టు సభను నడిపించుకోవడానికే తమను బయటకు పంపారు అని వ్యాఖ్యానించారు.
"చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపితే, మా నాయకుడికి జరిగిన అన్యాయంపై మేం అసెంబ్లీలో మాట్లాడకూడదా? చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలని... ఆయన్ని వెంటనే విడుదల చేయాలని... శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లతో టీడీపీ సభ్యులందరం సభకు వెళ్లాం. రాష్ట్ర శాసనసభ ఏర్పడినప్పటినుంచీ ఏనాడు సభలో జరగనివి నేడు జరిగాయి.
ఈరోజు నిజంగా శాసనసభకు దుర్దినమే. మంత్రిగా ఉన్న వ్యక్తి మీసం తిప్పి తొడగొడితే... దానికి మా సభ్యుడు బాలకృష్ణ స్పందించారు. శాసనసభ సాక్షిగా ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వాలని స్పీకరే ప్రయత్నించారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి అధికారపార్టీ శాసనసభ్యుల వెకిలిచేష్టలు, వెర్రిమొర్రివేషాలు కనిపించలేదు. సభ్యసమాజం తలదించుకునేలా వారు మాట్లాడిన మాటలు ఆయనకు వినిపించలేదు.
సాక్షాత్తూ రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తే హద్దులు దాటారు. దానికి ప్రతిగా బాలకృష్ణ స్పందించాడే తప్ప, అంతేగానీ ఆయన ఎక్కడా అనుచితంగా, హద్దులుమీరి ప్రవర్తించలేదు. మా సభ్యులు ఏం తప్పుచేశారని శాసనసభ నుంచి సస్పెండ్ చేశారో ప్రభుత్వమే చెప్పాలి. మేం 17 మంది ఉంటే, మాకు సమాధానం చెప్పే ఈ ప్రభుత్వానికి లేకపోయింది.
నేడు సభలో స్పీకర్ వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉంది. మంత్రి మమ్మల్ని రెచ్చగొడితే ఆయనపై ఎలాంటి చర్యలు లేవు.. కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు మమ్మల్ని బూతులు తిట్టినా స్పీకర్ పట్టించుకోలేదు. వారిని ఏమీ అనే ధైర్యంలేక, మమ్మల్ని తప్పుపట్టి, బయటకు పంపించారు.
చంద్రబాబునాయుడిని అన్యాయంగా జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే అంశాన్ని మేం సభలో లేవనెత్తితే, మాకు సమాధానం చెప్పలేక చర్చిస్తామంటూ కట్టు కథలు చెప్పారు. ఏముందని ఈ వ్యవహారంపై చర్చించాలి? ఏమీ లేని దానిలో ఏదో జరిగిందని తప్పుడు ప్రచారం చేసి, తప్పుడు కేసులతో మా అధినేతను జైలుకు పంపారని ప్రజలే గ్రహించారు” అని అచ్చెన్నాయుడు చెప్పారు.
చంద్రబాబుని ఇబ్బందిపెట్టాలనే ముఖ్యమంత్రి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: అచ్చెన్న
జైల్లో జరుగుతున్న పరిణామాలు... అక్కడి వసతులు... మా నాయకుడి భద్రత తదితర అంశాలపై తాము తొలినుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. "నేడు లోకేశ్ అన్నది నిజమే. జైల్లో ఒక ఖైదీ డెంగీతో మరణించడం నిజంగా ఆందోళనకర అంశం. చంద్రబాబుకి తగిన భద్రత కల్పించాలి. కనీసం ఆయన్ని గృహనిర్బంధంలో ఉంచాలని మేం డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనే ముఖ్యమంత్రి ఇలా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సాయంత్రం సమావేశమై ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని అచ్చెన్నాయుడు తెలిపారు.