- 1997 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి
- డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వచ్చిన పవన్ కుమార్
- విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా పదోన్నతి
కెనడాలో భారత ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పవన్ కుమార్ రాయ్ ను దేశ బహిష్కరణ చేయడంతో.. ఎవరీ పవన్ కుమార్ రాయ్ అనే ఆసక్తి నెలకొంది. ఖలిస్థాన్ నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రేమయం ఉందని ఆరోపిస్తూ కెనడా సర్కారు, పవన్ కుమార్ రాయ్ పై వేటు వేసింది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. పవన్ కుమార్ రాయ్ 1997 బ్యాచ్ కు చెందిన పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి. 2010 జులై 1 నుంచి డిప్యుటేషన్ పై ఆయన కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు.
కేంద్ర సర్కారు 2018 డిసెంబర్ లో పవన్ కుమార్ రాయ్ ను విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగానూ నియమించింది. అంతకుముందు వరకు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అధికారిగా పనిచేశారు. కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ గానూ సేవలు అందించారు. డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి ముందు, పంజాబ్ లో అమృత్ సర్ సీఐడీ ఎస్పీగా పనిచేశారు. 2008లో సీనియర్ ఎస్పీగా పదోన్నతిపై జలంధర్ కు బదిలీ అయ్యారు. మోఘా ఎస్ఎస్ పీగానూ పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లోకి వచ్చిన తర్వాత నమ్మకమైన అధికారిగా పేరు పొందారు. దీంతో సున్నితమైన కెనడాలో ఇంటెలిజెన్స్ హెడ్ గా కేంద్రం ఆయన్ను నియమించింది.
రాయ్ యూపీలోని బారాబంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి. రాయ్ సహచరులు ముగ్గురు ఇప్పుడు పంజాబ్ లో అడిషనల్ డీజీపీ ర్యాంకులో ఉన్నారు. కచ్చితమైన, నిజాయతీ అధికారిగా రాయ్ ను వారు పేర్కొంటారు.