Kamal Haasan: ఎంతో కాలంగా జరుగుతున్న అన్యాయానికి ముగింపు: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కమలహాసన్
- చారిత్రాత్మకమైన మైలురాయిగా అభివర్ణన
- ఆలస్యంగా అమలు చేయడం పట్ల ఆందోళన
- వెంటనే అమల్లోకి తేవాలని పిలుపు
- రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిళ్లకూ విస్తరించాలని వినతి
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలికారు. కేంద్ర సర్కారు నూతన పార్లమెంట్ భవనంలో తొలి సమావేశాలను నిర్వహిస్తుండడం తెలిసిందే. కొత్త పార్లమెంట్ భవంతిలో మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. స్వల్ప చర్చ అనంతరం నేడు లోక్ సభ ఈ బిల్లును ఆమోదించనుంది.
ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ చీఫ్ కమలహాసన్ స్పందిస్తూ.. ‘‘అతిపెద్ద మైనారిటీ వర్గానికి దీర్ఘకాలంగా జరుగుతున్న అన్యాయాన్ని ఈ బిల్లు సరిచేయనుంది’’ అని పేర్కొన్నారు. మన గణతంత్ర చరిత్రలో ఈ రోజును ఓ మైలురాయిగా పేర్కొంటూ, ప్రజాస్వామ్య ఆస్థానం కొత్త భవనంలోకి మారిందన్నారు. మహిళా బిల్లును చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
‘‘నిన్నటి రోజున పార్లమెంటు ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. లింగ సమానత్వాన్ని పాటించే దేశాలు వర్థిల్లుతాయి’’ అని కమల్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అయితే, ఈ బిల్లు జనగణన, తదుపరి నియోజకవర్గ పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తుందనడం పట్ల కమల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యంగా అమలు చేయడం అన్నది ఈ చారిత్రాత్మక నిర్ణయం కేవలం మాటలకే పరిమితమయ్యే రిస్క్ కు దారితీస్తుందంటూ, వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. మహిళలకు రిజర్వేషన్ ను రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిళ్లకూ విస్తరించాలని కోరారు.