HMDA: హుస్సేన్ సాగర్ ఒడ్డున అందుబాటులోకి మరో పర్యాటక ప్రాంతం
- జలవిహార్ పక్కన 10 ఎకరాల్లో లేక్ ఫ్రంట్ పార్క్
- అభివృద్ధి చేసిన హెచ్‌ఎండీఏ
- త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ ఒడ్డున మరో పర్యాటక ప్రాంతం అందుబాటులోకి రానుందని ఐటీ, పర్యాటక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ (హెచ్ఎండీఏ) జలవిహార్ పక్కన 10 ఎకరాల విస్తీర్ణంలో సుందరమైన లేక్ ఫ్రంట్ పార్క్ ను అభివృద్ధి చేసిందన్నారు. మరికొన్ని రోజుల్లోనే దీన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పార్క్‌కు వచ్చి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న బోర్డ్‌వాక్‌ను ఆస్వాదిస్తారని అన్నారు.
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పార్క్ వీడియోతో పాటు పగలు, రాత్రి తీసిన ఫొటోలను ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేశారు. కాగా, పురపాలక శాఖ మార్గనిర్దేశంలో హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీ హైదరాబాద్ తో పాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కులు, అర్బన్ ఫారెస్ట్‌లు, వాకింగ్ ట్రాక్‌లు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి.