TomTom Traffic Index 2022: ఈ నగరాల్లోట్రాఫిక్ నత్త నడక.. ట్రాఫిక్‌లోనే హరించిపోతున్న సమయం!
- లండన్‌లో ట్రాఫిక్ పరిస్థితి దారుణం
- 10 కిలోమీటర్ల ప్రయాణానికి 36 నిమిషాల 20 సెకన్లు
- ఏడాదికి 325 గంటలు ట్రాఫిక్‌లోనే
- బెంగళూరు, పూణెలకు కూడా జాబితాలో చోటు
- ‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022’ లో వెల్లడి
నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. నత్తనడకన సాగే ట్రాఫిక్‌ను చూస్తే దానికంటే కాలినడకన వెళ్లడం మేలని చాలాసార్లు అనిపిస్తుంది. మన దేశంలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఢిల్లీలో కనిపిస్తే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనూ ట్రాఫిక్ తిప్పలు మామూలే. అయితే, ఈ కష్టాలు ఒక్క మనదేశానికే పరిమితం కాదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే తీరు. ఒకసారి ట్రాఫిక్‌లో చిక్కుకుంటే అంతే సంగతులు.
ప్రపంచ నగరాల్లోని ట్రాఫిక్ జామ్‌లపై ‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022’ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో లండన్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అక్కడ 10 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు సగటున 36 నిమిషాల 20 సెకన్లు పడుతున్నట్టు వివరించింది. ఈ లెక్కన ఏడాదికి 325 గంటలు ట్రాఫిక్‌లోనే జీవితం గడచిపోతోందన్నమాట.
ఈ జాబితాలోని టాప్-8లో రెండు భారతీయ నగరాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి బెంగళూరు కాగా, రెండోది పూణె. బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 29 నిమిషాల 10 సెకన్లు పడుతోంది. జాబితాలో దీనికి లండన్ తర్వాతి స్థానం లభించింది. పూణెలో అదే దూరం ప్రయాణానికి 27 నిమిషాల 20 సెకన్లు పడుతోందట. ఇది ఆరోస్థానంలో నిలిచింది. 9, 10 స్థానాల్లో లిమా, పెరూ ఉన్నాయి. ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 27 నిమిషాల 10 సెకన్లు పడుతోంది. లిమా, ఫిలిప్పీన్స్‌లలో 27 నిమిషాలు పడుతున్నట్టు నివేదిక పేర్కొంది.
ట్రాఫిక్ జామ్ కారణంగా ఇంధన వినియోగం కూడా భారీగా పెరుగుతున్నట్టు నివేదిక తెలిపింది. అత్యధిక ఇంధన వినియోగం కారణంగా హాంకాంగ్ డ్రైవర్ల జేబులకు చిల్లులు పడుతున్నట్టు వివరించింది. ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయాల్లో ఇక్కడి డ్రైవర్లు ప్రతిరోజు 1000 డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. ఫలితంగా డ్రైవర్లకు హాంకాంగ్ అత్యంత ఖరీదైన నగరంగా మారింది.
56 దేశాల్లోని 390 నగరాల్లో మెట్రోపాలిటిన్ ప్రాంతంలోని సిటీ సెంటర్ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో డ్రైవర్ల నుంచి సేకరించిన ట్రిప్ డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.