Peethala Sujatha: చంద్రబాబునాయుడుకు హెరిటేజ్ మాత్రమే ఉంది... కానీ జగన్ కు...!: పీతల సుజాత
- చంద్రబాబు అరెస్ట్ పై మాజీ మంత్రి పీతల సుజాత మీడియా సమావేశం
- జగన్ కు లక్షల కోట్ల విలువ చేసే కంపెనీలు ఉన్నాయని వెల్లడి
- జగన్ కు పక్క రాష్ట్రం నుంచి సపోర్టు ఉందని వ్యాఖ్యలు
నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
చంద్రబాబుకు హెరిటేజ్ మాత్రమే ఉందని, కానీ జగన్ కు అధికారికంగా, అనధికారికంగా లక్షల కోట్లు విలువ చేసే కంపెనీలు ఉన్నాయని ఆరోపించారు. 2004లో కేవలం రూ.కోటి 73 లక్షల ఆస్తి మాత్రమే కలిగివున్న జగన్ నేడు లక్షల కోట్లకు అధిపతిగా ఎలా ఎదిగాడు? అని పీతల సుజాత ప్రశ్నించారు.
"జగన్ అభినవ దుర్యోధనుడిలా చెలరేగిపోతున్నాడు. జగన్ కు పక్క రాష్ట్రం నుంచి సపోర్టు ఉంది. సాక్షి, ఇతర ఛానళ్ల బలముంది... రౌడీలు, మాఫియాల మద్దతు ఉంది. లక్షల కోట్ల నల్లధనం ఉన్న జగన్ తాను ఒంటరివి అనడం ప్రజల్ని మోసం చేయడమే. జగన్ పీఠం త్వరలోనే కూలనుంది. తన లక్షల కోట్ల అవినీతి, లూటీని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివారిపై బురదజల్లుతున్నాడు" అని మండిపడ్డారు.
అభివృద్ధికి చిరునామాగా ఉన్న వ్యక్తి చంద్రబాబు
ఏ ఆధారాలు లేకుండా ఒక్క రూపాయి అవినీతి చేయని వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. రాష్ట్ర ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది. ఇక తెలుగు ప్రజల్ని ఆపటం జగన్ తరం కాదు. టీడీపీ, చంద్రబాబే మీ టార్గెట్ అని అర్థమౌతోంది. టీడీపీ బలహీనపడుతుందనుకున్నారు. మేం మరింత స్ట్రాంగ్ అయ్యాం. తెలుగుదేశం సైనికులు ఇంకాస్త బలపడ్డారు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. వారిలో ఆవేశం కట్టలు తెంచుకొస్తోంది.