Raja Singh: చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే ప్రజల మనసుల్లో ఆయన అంతగా ఎదుగుతారు: రాజాసింగ్

Raja Singh opines on Chandrababu arrest issue

  • టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్
  • చంద్రబాబు అంటే జగన్ భయపడుతున్నారన్న రాజాసింగ్
  • చంద్రబాబును అడ్డుకునేందుకు అరెస్ట్ చేయించారని వెల్లడి
  • ఓ మాజీ సీఎం పట్ల అనుసరించిన విధానం తప్పు అని పేర్కొన్న బీజేపీ ఎమ్మెల్యే

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. చంద్రబాబు అంటే ఏపీ సీఎం జగన్ భయపడుతున్నారని అన్నారు. అందుకే, ఎలాంటి సంబంధం లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. 

"జగన్ మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఒక్కటే... ఒక స్పాంజ్ బాల్ ను కిందకు గట్టిగా కొడితే అది మరింతగా పైకి లేస్తుంది... చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబుపై మీరు ఎంత దౌర్జన్యం చేస్తే ఆయన ప్రజల మనసుల్లో అంతగా ఎదుగుతారు" అని వ్యాఖ్యానించారు. 

ఓ మాజీ ముఖ్యమంత్రిపై అరాచకంగా వ్యవహరించడం, ఆ విధంగా అరెస్ట్ చేయడం పద్ధతి కాదని రాజాసింగ్ హితవు పలికారు. ఒక సాధారణ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటేనే ముందు ఒక నోటీసు ఇస్తారని, ఆ నోటీసుకు సదరు ఎమ్మెల్యే సమాధానమిస్తారని, ఆ సమాధానం నచ్చకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేస్తారని వివరించారు. అందుకోసం ఒక విధివిధానం ఉందని, కానీ చంద్రబాబు విషయంలో ఎలాంటి ప్రొసీజర్ ను అనుసరించినట్టు కనిపించడంలేదని అన్నారు. 

మొదట ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు కూడా లేదని, ఆ తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారని రాజాసింగ్ వెల్లడించారు. చంద్రబాబును అడ్డుకోవడానికే జగన్ ఈ చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

గతంలో జగన్ కూడా అరెస్టయ్యాడని, ఆయన ఏంచేశాడో, ఏంచేయలేదో తెలుగు రాష్ట్రాల వారికి తెలుసని అన్నారు. తన అరెస్ట్ కు ప్రతీకారంగానే ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ప్రజలు అనుకుంటున్నారని రాజాసింగ్ వివరించారు. ఏదేమైనా ఈ అరెస్ట్ తో జగన్ కు మైనస్ అవుతుందని, చంద్రబాబుకు ప్లస్ అవుతుందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబు మొదటి నుంచి ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి అని, ప్రజల కోసం దేనికైనా నిలబడే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఇప్పుడు ప్రజల కోసమే జైలుకు వెళ్లాడని తెలిపారు. చంద్రబాబుపై మోపిన ఆరోపణలు ఫేక్ అని, ఆ ఆరోపణలు కోర్టులో నిలబడవని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని రాజాసింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News