kandula Jaahnavi: కందుల జాహ్నవి మరణంపై స్పందించిన ప్రియాంకా చోప్రా
- ఆలస్యంగా వెలుగు చూడడం పట్ల ఆవేదన వ్యక్తీకరణ
- జీవితానికి ఎవరూ విలువ కట్టరాదంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్
- దీనిపై విచారణ చేయాలని ఇప్పటికే డిమాండ్ చేసిన భారత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాస్టర్స్ విద్యార్థి కందులు జాహ్నవి (23) అమెరికాలో రోడ్డు ప్రమాదంలో దయనీయంగా మరణించడం పట్ల ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా స్పందించింది. నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలో చదువుతున్న జాహ్నవి.. ఈ ఏడాది జనవరిలో సియాటెల్ లో రోడ్డు దాటుతున్న ఆమెను వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. దీంతో 100 అడుగుల దూరంలో ఎగిరి పడి ఆమె మరణించడం తెలిసిందే. ఆమె ప్రాణానికి పెద్దగా విలువ లేదని, 11వేల డాలర్ల చెక్ రాసిస్తే సరిపోతుందిలేనంటూ జాహ్నవి మరణంపై పోలీసు ఉన్నతాధికారులు పరాచకంగా మాట్లాడుకున్న సంభాషణల రికార్డులు కూడా వెలుగు చూశాయి.
దీనిపై ప్రియాంకా చోప్రా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ‘‘తొమ్మిది నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడం బాధాకరం. జీవితం అంటే జీవితమే. దానికి ఎవరూ విలువ కట్టకూడదు’’అని ప్రియాంక తన అభిప్రాయాలను పంచుకుంది. జాహ్నవి మరణంపై పోలీసు అధికారుల సంభాషణలు వెలుగు చూడడంతో, దీనిపై విచారణ చేయాలని భారత్ డిమాండ్ కూడా చేసింది. దీంతో ఆమె మరణాన్ని ఉద్దేశించి నవ్వలేదంటూ సదరు పోలీసు అధికారి తరఫున అక్కడి ఆఫీసర్స్ గిల్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది.