Visa: సందర్శకులు, విద్యార్థులకు వీసా ఫీజు పెంచిన బ్రిటన్
- వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ సర్కారు
- సందర్శకుల వీసాపై రూ.1,543 పెంపు
- విద్యార్థి వీసాపై రూ.13,070 పెంపు
- పెంచిన వీసా ఫీజులు అక్టోబరు 4 నుంచి అమలు
బ్రిటన్ ప్రభుత్వం వీసాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ వచ్చే విద్యార్థులకు, సందర్శకులకు వీసా ఫీజు పెంచుతున్నట్టు వెల్లడించింది. పెంచిన వీసా ఫీజులు అక్టోబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఆర్నెల్ల కంటే తక్కువ సమయం బ్రిటన్ లో ఉండే సందర్శకులకు వీసా ఫీజుపై రూ.1,543... విద్యార్థుల వీసా ఫీజును రూ.13,070 మేర పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. పెంచిన ఫీజు అనంతరం సందర్శకుల వీసా కోసం రూ.11,835 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టూడెంట్ వీసా కోసం రూ.50,428 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్లమెంటులో చట్టం కూడా తయారైందని బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, పెంచిన వీసా ఫీజులు, హెల్త్ సర్ చార్జీల ద్వారా వచ్చే సొమ్మును జాతీయ ఆరోగ్య పథకానికి అందిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు.