Bull Dogs: అమెరికన్ బుల్లీ డాగ్స్ పై నిషేధం విధించిన రిషి సునాక్

UK bans American XL Bully Dogs

  • బ్రిటన్ లో ప్రజలపై దాడులకు దిగుతున్న బుల్లీ డాగ్ జాతి శునకాలు
  • ఓ వ్యక్తి మృతి... ఒక యువతికి గాయాలు
  • ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న బ్రిటన్ ప్రధాని సునాక్
  • త్వరలోనే చట్టం తీసుకువస్తున్నామని వెల్లడి 

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అమెరికన్ ఎక్స్ఎల్ బుల్లీ డాగ్ జాతి కుక్కలను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. అందుకు కారణం... బ్రిటన్ వ్యాప్తంగా చాలాచోట్ల బుల్లీ డాగ్స్ ప్రజలపై దాడులకు దిగుతుండడమే. 

 బుల్లీ డాగ్స్ చాలా బలమైన కుక్కలు. వీటి తల భాగం ఎంతో దృఢంగా ఉంటుంది. చూస్తేనే జడుసుకునేలా దీని రూపం ఉంటుంది. పొట్టిగా, వెడల్పైన దవడలతో భీకరంగా కనిపించే బుల్లీ డాగ్ లు స్వభావరీత్యా దూకుడుగా ఉంటాయి. 

ఇటీవల బర్మింగ్ హామ్ లో ఓ యువతిపై ఈ అమెరికన్ బుల్లీ డాగ్ దాడి చేసింది. ఆ యువతిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులకు కూడా కుక్క కాట్లు తప్పలేదు. ఇక, స్టోర్నాల్ లో జరిగిన ఘటన విషాదకరం. బుల్లీ డాగ్ దాడిలో తీవ్రగాయాలు కావడంతో ఓ వ్యక్తి మరణించాడు. 

ఈ ఘటనలను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. అమెరికన్ ఎక్స్ఎల్ బుల్లీ డాగ్స్ ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల భయాందోళనలను తాను అర్థం చేసుకోగలనని సునాక్ పేర్కొన్నారు.

ఏవో కొన్ని శిక్షణ లేని శునకాలు ఇలా వ్యవహరిస్తున్నాయని అనుకోవడానికి లేదు... జరుగుతున్న పరిణామాలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. తక్షణమే ఇలాంటి శునకాల దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఏంచేయాలన్న దానిపై కసరత్తులు చేస్తున్నామని సునాక్ వెల్లడించారు. 

అమెరికన్ ఎక్స్ఎల్ బుల్లీ డాగ్స్ గురించి ఇప్పటివరకు చట్టంలో ప్రస్తావన లేదని, కొత్తగా ప్రమాదకర శునకాల చట్టం తీసుకువస్తున్నామని, ఈ ఏడాది నాటికి ఈ చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

Bull Dogs
Ban
Rishi Sunak
UK
  • Loading...

More Telugu News