Nara Lokesh: ఢిల్లీలో లోకేశ్ అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్
- ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు
- పార్టీ ఎంపీలకు లోకేశ్ దిశానిర్దేశం
- చంద్రబాబు అరెస్ట్ ను ఉభయ సభల దృష్టికి తీసుకెళ్లాలని సూచన
సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై లోకేశ్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారన్న విషయాన్ని పార్లమెంటులో బలంగా వినిపించాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులను ఉభయసభల దృష్టికి తీసుకెళ్లేలా టీడీపీ ఎంపీల కార్యాచరణ ఉండాలని సూచించారు.
అంతకుముందు, లోకేశ్ ఢిల్లీలో మాట్లాడుతూ... వైసీపీని వ్యతిరేకించే పార్టీలు టీడీపీ-జనసేనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తమతో కలిసి వచ్చే ప్రతి పార్టీకి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో విజయం తమదేనని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ అవినీతిపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఆయనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ చాలా నిదానంగా సాగుతోందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీ ప్రచారంలో ఓ స్పీడ్ బ్రేకర్ గానే పరిగణిస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు.