Singapore: సింగపూర్‌లో సహోద్యోగి వేలుకొరికేసిన ఎన్నారైకి జైలు శిక్ష
- నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు ఎన్నారైలు మద్యం మత్తులో ఉండగా గొడవ
- వారి గొడవ ఆపేందుకు వచ్చిన మరో భారతీయుడి వేలుకొరికేసిన నిందితుడు
- వేలులో కొంత భాగం తెగిపోవడంతో పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
- నిందితుడికి 10 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
తన సహోద్యోగి చూపుడు వేలులో కొంతభాగం తెగిపోయేలా కొరికిన ఓ ఎన్నారైకి సింగపూర్ కోర్టు 10 నెలల జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే, థంగరుసు రంగస్వామి సింగపూర్‌లో ఎక్స్కవేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కాకిట్ బుకిట్ ప్రాంతంలో కంపెనీ ఏర్పాటు చేసిన ఓ డార్మిటరీలో ఉంటున్నాడు. కాగా, ఏప్రిల్ నెలలో అతడి సహోద్యోగులు నాగూరన్ బాలసుబ్రమణ్యన్, రామమూర్తి అనంత్‌రాజ్ ఓ రాత్రి మద్యం సేవించడం ప్రారంభించారు. వారికి కొద్ది దూరంలో రంగస్వామి కూడా మద్యం తాగుతున్నాడు.
ఇంతలో అకస్మాత్తుగా రంగస్వామి అరవడం ప్రారంభించడంతో నిశ్శబ్దంగా ఉండాలంటూ రామమూర్తి అతడికి సూచించాడు. దీంతో, వారి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో వివాదాన్ని చల్లార్చేందుకు నాగూరన్ ప్రయత్నించారు. గొడవపడుతున్న ఇద్దరినీ దూరం జరిపే ప్రయత్నంలో అతడు ఉండగా రంగస్వామి నాగూరన్ చూపుడు వేలు కొరికేశాడు. కష్టపడి అతడి నుంచి విడిపించుకున్న బాధితుడు తన వేలులో కొంత భాగాన్ని కోల్పోయినట్టు గుర్తించాడు. తెగిపడిన భాగం కూడా లభించలేదు. చివరకు అతడి గాయానికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాను నేరం చేసినట్టు నిందితుడు అంగీకరించడంతో కోర్టు అతడికి 10 నెలల జైలు శిక్ష విధించింది.