Nipah virus: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం.. కోజికోడ్ లో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు
![Nipah virus in Kerala Schools colleges shut in Kozhikode till Sept 17](https://imgd.ap7am.com/thumbnail/cr-20230915tn6503d1b5139f5.jpg)
- వైరస్ కారణంగా ఇద్దరి మృతి
- విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు
- కోజికోడ్ కు చేరుకున్న కేంద్ర బృందం
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కోజికోడ్‌లోని పాఠశాలలు, కళాశాలలకు రేపటి వరకు సెలవులను పొడిగించింది. రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కోజికోడ్ జిల్లాలోని అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు గత రెండు రోజులుగా సెలవులు ఇచ్చారు. అనవసర ప్రయాణాలు, సమావేశాలకు దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోజికోడ్ కలెక్టర్ ప్రజలను కోరారు.
మరోవైపు రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి ఒక బృందం కోజికోడ్ చేరుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆగస్టు 30న మరణించిన మొదటి వ్యక్తిని కాంటాక్ట్ అయిన హై-రిస్క్ కాంటాక్ట్ గ్రూప్‌లో ఉన్న వారందరి నమూనాలను తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారి నమూనాలను కూడా తీసుకొని ల్యాబ్‌కు పంపుతామన్నారు. వైరస్ సోకిన 9 ఏళ్ల బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.