- భారత్ కావాలనే ఓడిపోతుందంటూ మెస్సేజ్ లు, కాల్స్ వచ్చినట్టు వెల్లడి
- భారత్ అసలు ఎందుకు ఓడిపోతుందో చెప్పండంటూ ప్రశ్న
- భారత్ గొప్పగా పోరాడిందంటూ ప్రశంస
ఆసియాకప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకపై భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించగా.. భారత వ్యతిరేక శక్తులు దీనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు దిగాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బయటపెట్టారు. భారత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు తనకు కాల్స్, మెస్సేజెస్ వచ్చినట్టు చెప్పారు. శ్రీలంక చేతిలో ఓడిపోయి, ఆసియాకప్ నుంచి పాకిస్థాన్ వెళ్లిపోయేలా చేయాలన్నది భారత్ పథకమని కొందరు తనతో చెప్పినట్టు అక్తర్ వెల్లడించారు.
అయితే, శ్రీలంక మనస్ఫూర్తిగా పోరాడిందంటూ, మ్యాచ్ లో భారత్ పై చేయి సాధించినట్టు అక్తర్ పేర్కొన్నారు. దునిత్ వెల్లాలగే గొప్ప ప్రదర్శన చేశాడంటూ, ఇది భారత్ ను నిలువరించలేకపోయినట్టు అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు అక్తర్ స్పందిస్తూ.. ‘‘మీరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. భారత్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నాకు కాల్స్, సందేశాలు వస్తున్నాయి. పాకిస్థాన్ ను ఇంటికి పంపించేందుకు వారు కావాలనే ఓడిపోబోతున్నారంటూ మీమ్స్, మెస్సేజెస్ వస్తున్నాయి. ‘‘మీరు సరిగ్గానే ఉన్నారా? వారు (శ్రీలంక) తమ శక్తి కొద్దీ బౌలింగ్ చేశారు. 20 ఏళ్ల బాలుడు 43 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. భారత్ కావాలనే ఓడిపోతోందంటూ నాకు భారత్, ఇతర దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి’’ అని అక్తర్ పేర్కొన్నాడు.
భారత్ శ్రీలంకను తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదన్నారు. ఫైనల్స్ కు క్వాలిఫై అవ్వడానికి వారు గెలవాల్సి ఉంటుందన్నారు. ‘‘వారు ఎందుకు ఓడిపోతారు చెప్పండి? వారు ఫైనల్ కు వెళ్లాలనే కోరుకుంటారు. అర్థం లేని మీమ్స్ ను కట్టిపెట్టండి. భారత్ నుంచి నిజంగా ఇది గొప్ప పోరాటం. కుల్ దీప్ ఆడిన తీరు అద్భుతం. జస్ప్రీత్ బుమ్రా వేపు చూడండి. స్వల్ప స్కోరునే కాపాడుకున్నారు’’ అని అక్తర్ అనాలోచిత ఆరోపణలకు తగిన బదులిచ్చారు.