Uttarakhand: మదరసాలలో సంస్కృత భాషా బోధన.. ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు ప్రకటన
- మదరసాలలో ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా బోధన సాగుతుందన్న చైర్మన్ షాదాబ్ షామ్స్
- సంస్కృతంతో పాటూ ఇతర సబ్జెక్టులు బోధిస్తామని వెల్లడి
- ఆధునిక, ఆధ్యాత్మిక పాఠాల కలబోతతో హైబ్రీడ్ విద్యావిధానం అనుసరిస్తామని ప్రకటన
- ఫలితంగా, విద్యార్థులకు అదనపు అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మదరసాలలో ఇకపై ఎన్సీఈఆర్టీ సిలబస్ కూడా బోధించనున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా మదరసాలలో సంస్కృత భాష కూడా బోధించనున్నట్టు వెల్లడించారు. చైర్మన్ ప్రకటన ప్రకారం, మొత్తం 117 మదరసాలలో సంస్కృతంతో పాటూ ఇతర సబ్జెక్టులు కూడా బోధించనున్నారు.
ఈ విద్యావిధానం ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు అనుగూణంగా ఉంటుందని చైర్మన్ పేర్కొన్నారు. ఆధునిక విద్య కూడా అవసరమన్న ఆయన.. ఆధునిక, ఆధ్యాత్మిక విద్య కలగలిపిన హైబ్రీడ్ బోధనను అనుసరిస్తామని చెప్పారు. దీంతో, మదరసాలలో చదువుకున్న వారికి అదనపు అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటివరకూ మదరసాలలో కేవలం ఇస్లామిక్, అరబిక్ ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే బోధిస్తున్న విషయం తెలిసిందే.