US apples: యూఎస్ యాపిల్స్ దిగుమతులపై టారిఫ్ కట్.. వివరణ ఇచ్చిన కేంద్రం
- అదనపు సుంకాలనే తొలగించామని వాణిజ్య శాఖ ప్రకటన
- దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తుల మధ్య పోటీ ఉంటుందన్న అభిప్రాయం
- కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపణలతో వివరణ
అమెరికా యాపిల్స్ దిగుమతులపై గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విధిందించిన ప్రతీకార టారిఫ్ లను కేంద్రం ఉపసంహరించింది. దీనివల్ల అమెరికా రైతులకు ప్రయోజనం కలగనుంది. అలాగే, మన దేశ వినియోగదారులకు కూడా ధరల పరంగా కొంత ఉపశమనం లభించనుంది. యాపిల్స్ తో పాటు వాల్ నట్స్, ఆల్మండ్స్ పై నాడు భారత సర్కారు అదనపు సుంకాలు మోపింది. భారత్ నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై ట్రంప్ సర్కారు సుంకాలు పెంచడంతో.. ప్రతీకార చర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.
మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎఫ్ఎస్ఎన్) డ్యూటీ 50 శాతం, 100 శాతం ఇక ముందూ యాపిల్స్, వాల్ నట్స్ పై కొనసాగుతాయని కేంద్ర సర్కారు తాజాగా స్పష్టం చేసింది. అదనంగా విధించిన 20 శాతం డ్యూటీని మాత్రమే తొలగించినట్టు స్పష్టం చేసింది. దేశంలోని యాపిల్ రైతుల కంటే, అమెరికాలో యాపిల్ రైతులకే కేంద్ర సర్కారు సాయం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ విమర్శించడంతో తాజా వివరణ విడుదలైంది.
అమెరికా యాపిల్స్, వాల్ నట్స్, అల్మండ్స్ పై అదనపు సుంకాలను తొలగించడం అన్నది దేశీయంగా వాటిని పండిస్తున్న రైతులకు నష్టం కలిగించదని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉత్పత్తుల ప్రీమియం మార్కెట్లో మంచి పోటీకి అవకాశం ఉంటుందని పేర్కొంది. దీంతో దేశీయ వినియోగదారులకు మెరుగైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని అభిప్రాయపడింది.