Parliament Staff: పార్లమెంటు సిబ్బందికి డ్రెస్ కోడ్.. కాషాయీకరణే అంటున్న ప్రతిపక్షాలు

Khaki coloured pants and lotus motif turbans Complete look of Parliament staff

  • ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
  • సిబ్బంది డ్రెస్‌ను డిజైన్ చేసిన నిఫ్ట్
  • చొక్కాలపై కమలం పువ్వు
  • సెక్యూరిటీ సిబ్బందికి మిలటరీ తరహా దుస్తులు
  • తలపై మణిపురి తలపాగా

లోక్‌సభ, రాజ్యసభ సిబ్బంది ఇకపై కొత్త యూనిఫాంలో కనిపించబోతున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో సిబ్బంది కొత్త డ్రెస్‌కోడ్‌తో దర్శనమివ్వబోతున్నారు. చాంబర్ అటెండెంట్స్, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు, మార్షల్స్ సహా అందరూ సరికొత్త యూనిఫాం ధరించనున్నారు. 

సిబ్బంది దర్శించే యూనిఫాంకు ‘ఇండియన్’ టచ్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఇది కాషాయీకరణలో భాగమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బంది ధరించే నెహ్రూ జాకెట్, ఖాకీ ప్యాంట్లను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది. ఉద్యోగులు బంద్‌గాల సూట్‌కు బదులుగా ఎరుపు, నీలం రంగు కలగలిసిన మెజెంటా లేదంటే ముదురు గులాబీ రంగు నెహ్రూ జాకెట్ ధరిస్తారు. వారి చొక్కాలపై కమలం పువ్వును డిజైన్ చేశారు. ఇప్పుడిదే విమర్శలకు కారణమైంది. 

    రెండు సభల్లోని మార్షల్స్ దుస్తులు కూడా మారాయి. వారు ఇకపై మణిపురి తలపాగాలను ధరిస్తారు. పార్లమెంటు భవనంలోని సెక్యూరిటీ సిబ్బంది సఫారీ సూట్‌కు బదులుగా మిలటరీ దుస్తులను తలపించేలా కామోఫ్లేగ్ డ్రెస్ ధరిస్తారు. కాగా, ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సమావేశాల ఎజెండా మాత్రం ప్రకటించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే దేశం పేరును భారత్‌గా మార్చే ప్రతిపాదన తీసుకొస్తారని సమాచారం. అయితే, రాజ్యాంగంలో ఇప్పటికే ‘ఇండియా అంటే భారత్’ అని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో పేరు మార్పు అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

More Telugu News